రామగిరి, సూర్యాపేట టౌన్, డిసెంబర్ 24 : ప్రేమమూర్తి ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ చర్చీలు విద్యుద్దీపాల కాంతుల్లో వెలుగులీనుతున్నాయి. క్రైసవ మత పెద్ద ప్రార్ధనల నడుమ మంగళవారం అర్ధరాత్రి చర్చీల్లో కేక్ కేటింగ్లు చేసి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేక ప్రార్ధనలకు చర్చీలను ముస్తాబు చేశారు.
శాంతి, సామరస్యాలకు ప్రతీకగా జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా క్రైస్తవులకు ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమన్నారు. నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం వంటివన్నీ క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి అందించిన మహోన్నత సందేశాలన్నారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్ ఓ ప్రకటనలో క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.