నకిరేకల్, డిసెంబర్ 3: కాంగ్రెస్‌కు సపోర్టు చేయకపోతే లారీతో తొక్కించి చంపేస్తామని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశమే స్వయంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను బెదిరిస్తున్నాడు. నకిరేకల్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యమా? లేక ఆటవిక పాలనా అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు సృష్టిస్తున్న అలజడులపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గుండాలు చేస్తున్న దాడులపై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో ఎస్సీ రిజర్వుడ్ స్థానానికి ఏడుకొండలు-జానకమ్మ సర్పంచ్‌గా నామినేషన్ వేస్తే కాంగ్రెస్ నాయకులు గెలవలేక ఆటోలో వెళ్తున్న వారిద్దరిని తిప్పర్తి మండలం మర్రిగూడెం స్టేజీ వద్ద ఎమ్మెల్యే వీరేశం అనుచరులు, ప్రభుత్వ కళాకారులు కారు అడ్డుపెట్టారన్నారు. వారిద్దరు ఎలాగోలా తప్పించుకొని బావుల వెంట పరిగెడుతూ నల్లగొండకు వెళ్లి దాచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ నెలకు రూ.30 వేలు జీతం తీసుకుంటున్న కళాకారులు కూడా బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇంత దారుణానికి ఒడిగడతారా? అని ప్రశ్నించారు. రామన్నపేటలో ఒక ఎస్సీ సోదరుడని చూడకుండా సెంటర్‌కు పిలిపించి ‘లారీతో తొక్కించి చంపేస్తా బిడ్డ..ఎవరితో చెప్పుకుంటవో చెప్పుకో’ అని స్వయంగా ఎమ్మెల్యే బెదిరించడం ఎంత బరితెగించి, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడో అర్ధమవుతుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
చిట్యాల మండలం ఏపూరులో మందుల లక్ష్మమ్మ 3వ వార్డులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకులు విత్ డ్రా చేసుకోవాలని వేధింపులకు గురిచేస్తే లక్ష్మమ్మ ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలంటే లెక్కలేదు. ప్రజాస్వామ్యమంటే గౌరవం లేదు. విచ్చలవిడిగా ఎమ్మెల్యే వీరేశం అనుచర వర్గం బీఆర్ఎస్ నాయకులపై రౌడీయిజం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో బీఆర్ఎస్ అభ్యర్థులను, నాయకులను వేధిస్తున్నారన్నారు. నకిరేకల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకునే విధంగా చూడాలని నల్లగొండ జిల్లా ఎస్పీకి మాజీఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.