చందంపేట/దామరచర్ల, మార్చి 6 ; రైతులు ఇప్పుడిప్పుడే తెల్ల బంగారం నుంచి.. ఎర్ర బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో మిర్చి సాగుపై ఆసక్తి చూపుతున్నారు.. జిల్లాలోని చందంపేట, దామరచర్ల మండలాల్లో ఈ సారి మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది. సుమారు 1,600 ఎకరాల్లో సాగు చేశారు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
చందంపేట మండలంలో గతేడాదితో పోల్చితే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మండలంలో ఈసారి సుమారు 600 ఎకరాల్లో సాగు చేసినట్లు గుర్తించారు. రేకులగడ్డ, పొగిళ్ల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, చిత్రియాల, పెద్దమూల, బుడ్డోనితండా, నల్లచెలమూల, నేరుట్లతండాలో మిర్చి అధికంగా సాగైంది. దామరచర్ల మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో మిరప పంటను సాగుచేశారు. కల్లేపల్లి, తిమ్మాపురం, నర్సాపురంలో తేజ రకం సుమారు 150 ఎకరాల్లో సాగుచేయగా, 850 ఎకరాల్లో సాధారణ మిర్చి సాగు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడంతో మిర్చి సాగు విస్తీర్ణం పెరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రెండు, మూడు కోతల పంట తీశారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
నీటి వసతి అనుకూలం..
ప్రభుత్వ చర్యల కారణంగా నీటి లభ్యత అధికంగా ఉండటంతో రైతులు అనుకున్న రీతిలో దిగుబడి సాధిస్తున్నారు. చెరువుల్లో నీరు ఉండడం, బోర్లు బాగా పోయడం, ఎత్తిపోతలు, సాగర్ కాల్వల ద్వారా నీరు అందించడంతోపాటుగా ప్రకృతి అనుకూలించడంతో రైతులకు కలిసి వచ్చింది.
కలిసొచ్చిన ధర..
ఈ ఏడాది మిర్చి రైతులకు ధర కలిసి వచ్చింది. ఇప్పటికే క్వింటాల్‌కు 25 వేల నుంచి 30 వేల వరకు ధర పలుకుతుండగా తేజ రకం 18 వేల నుంచి 20 వేల వరకు పలుకుతుంది. ఎకరానికి 70 వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబతున్నారు. సుమారు 10నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.
మూడెకరాల్లో సాగు చేశా
నాకున్న మూడెకరాల్లో మిర్చి పంట సాగు చేశా. ఒక్కో ఎకరానికి ఇప్పటికే నాలుగు క్వింటాళ్ల చొప్పున 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాటిని అమ్మగా రూ.2.64 లక్షలు వచ్చాయి. ఇంకా 18 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నా. కొంచెం కష్టపడితే మిర్చిలో మంచి లాభాలు ఉంటాయి. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడం కూడా మిర్చి సాగు పెరిగేందుకు ఒక కారణం.
–పగడాల వెంకటయ్య, రైతు, రేకులగడ్డ, చందంపేట