కోదాడ, డిసెంబర్ 31 : కర్ల రాజేశ్ మృతికి ప్రధాన కారణమైన చిలుకూరు ఎస్ఐ సురేశ్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోదాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కుల వివక్షతతోనే అసలు దోషిని విడిచిపెట్టి కోదాడ రూరల్ సీఐ ప్రతాప లింగంను సస్పెండ్ చేయడం సహించరానిదన్నారు. కాంగ్రెస్ నేతలు సైతం ఈ అంశంపై నోరు మెదపడం లేదని, ఇందుకు కారణం ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. బలమైన సామాజిక వర్గం కనుకనే చిలుకూరు ఎస్ఐని సస్పెండ్ చేయడం లేదని ఆయన ఆరోపించారు. నియోజకవర్గానికి బాధ్యత వహించే నేతలు సైతం ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. న్యాయం జరిగే వరకూ లలితమ్మ కుటుంబానికి, ఎమ్మార్పీఎస్, దళిత సంఘాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.