– బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్
నల్లగొండ రూరల్, జనవరి 09 : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు, విద్యార్థుల బలవన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డియే కారణమని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నడు కావునా బాధ్యత వహించి ఇప్పటికైనా విద్యారంగ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడకుండా తగు చర్యలు తీసుకుని, అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ సమీపంలోని చర్లపల్లిలో గల మహిళా డిగ్రీ సాంఘిక సంక్షేమ కళాశాలలో ఎస్సీ విద్యార్థిని బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం, అలాగే గత మూడు రోజుల క్రితం ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతూ బీసీ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని హేమశ్రీ ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందన్నారు.
ఇట్టి ఆత్మహత్యలు ఆపాలంటే తక్షణమే అన్ని గురుకుల వసతి గృహాల్లో, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్లో మానసిక వైద్య నిపుణులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆర్థికంగా బలోపేతం కావాలంటే విద్య ప్రమాణికంగా భావించి దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో 1,100 పైగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించినట్లు తెలిపారు. కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలలు మూతపడే విధంగా కుట్ర చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్, ఇటికాల రాము, విన్నపరెడ్డి సైదిరెడ్డి, కుంటిగొర్ల లింగయ్య, దుబ్బాక రామకృష్ణ, రవీందర్ రెడ్డి, లింగస్వామి, శంకర్, సైదులు పాల్గొన్నారు.