సూర్యాపేటను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి విప్లవాత్మక అభివృద్ధికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. ఆదివారం కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీతోపాటు మరిన్ని భవనాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం ప్రగతి నివేదన బహిరంగ సభలో సూర్యాపేటకు మరిన్ని వరాలు కురిపించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కోరిన వెంటనే ఓకే చెప్పారు. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు చొప్పున ఇస్తామని ప్రకటించారు. సూర్యాపేట కళాభారతి నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం, మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు కొత్త భవనం, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నంత సేపూ సభలో జనం చప్పట్లు, కేరింతలు హోరెత్తించాయి.
– సూర్యాపేట, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో సూర్యాపేటలో జరిగిన ప్రగతి నివేదన సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన సందర్భంలో మరో మారు వరాల జల్లు కురిపించారు. వరాలు ఇస్తూనే మంత్రిపై ప్రశంసలు గుప్పించి మహా హుషారు అంటూ చమత్కరించారు. “2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను సూర్యాపేటకు వస్తుంటే అప్పటికే పైన మిర్యాలగూడెంలో సభ ఉండే… అప్పుడు జగదీశ్‌రెడ్డి ఎన్నికల సభకు కేవలం 7 నిమిషాల ఉంటే అదే సమయంలో జగదీశ్‌రెడ్డిని గెలిపించండి..ఆయన మామూలు ఎమ్మెల్యేగా ఉండడు మంత్రి అయితడు అని చెప్పి మంత్రిని చేసిన, సూర్యాపేటను జిల్లాగా చేస్తా అన్న చేసిన నా బాధ్యత అయిపోయింది” అని సీఎం అన్నారు. నాడు దంతాలపల్లి నుంచి సూర్యాపేటకు వస్తుంటే ఆ రోడ్డు గురించి నాటి నా బాధ వర్ణనాతీతమని చెబుతూ ఈ రోడ్డేందో కానీ దంతాలు ఊడిపోయేట్టు ఉన్నాయి అనుకున్నామన్నారు. ఇప్పుడు రోడ్లే కాదు కాల్వలూ తెచ్చుకున్నాం” అన్నారు. సూర్యాపేట, తుంగతుర్తిలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది..ఎక్కడికి పోయిన నీళ్లు ఎలా వచ్చినయ్..అని ప్రశ్నించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి కొన్ని కోరికలు ముందు పెట్టిండు… జగదీశ్‌రెడ్డి గింత హుషారు అనుకోలేదని చమత్కరించారు. మాకు అన్నీ ఇచ్చిరు… సూర్యాపేట జిల్లా కూడా ఇచ్చారు.. అన్నీ అయిపోయాయి… సభకు మీరు వచ్చిపోతే చాలు ఏమీ అడగను అని మంత్రి తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంతే కాకుండా ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో “మనం ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదు ఖచ్చితంగా రుణమాఫీ చేయాలని వాదించిన మంత్రుల్లో అగ్రగణ్యుడు జగదీశ్‌రెడ్డి” అని సీఎం కితాబిచ్చారు.
జగదీశ్‌రెడ్డి కథ ఎలా ఉందంటే ఇంటికి వచ్చిన చుట్టం పోతాఉంటే సద్దెన్నం ఉంది తింటావా అంటే.. చలి అన్నం తింటా… ఉడికినాక ఉడుకు అన్నం కూడా తింటా అన్న చందంగా ఉందంటూ సీఎం కేసీఆర్ చమత్కరించారు. మంచి నాయకులు ఉంటే తమ ప్రాంతం, ప్రజల గురించి తప్పకుండా తపన పడతారని అలాగే మన ఎమ్మెల్యేలు అద్భుతంగా ప్రజల మధ్య ఉండి పని చేస్తున్నారని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. సూర్యాపేటలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి మాకు అభివృద్ధికి డబ్బులు కావాలని మంత్రి అడిగారు.. తప్పకుండా వాళ్ల కోరికను మన్నించి ప్రతి గ్రామానికి రూ.10 లక్షలు ప్రత్యేకంగా సీఎం నిధుల నుంచి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లాలోని ఐదు మున్సిపాల్టీలు కోదాడ, తిరుమలగిరి, నేరేడుచర్ల, సూర్యాపేట, హుజూర్‌నగర్‌కు నిధులు ఇస్తున్నానని.. సూర్యాపేటకు రూ.50 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున ఇస్తానని చెప్పారు. “సూర్యాపేటలో కళాభారతి కావాలని కోరిండు… ఇది మంచి కోరిక.. ఇక్కడ మంచి కల్చర్ ఉన్న సెంటర్… నాడు కమ్యూనిస్టు ఉద్యమంలో అద్భుతమైన పాటలు వచ్చాయి.. ఇవాల్టికి ఆ పాటలు గొప్పగా ఉన్నాయంటూ అలాంటి గొప్ప కవులు కళాకారుల వారసత్వం ఉన్న గడ్డ సూర్యాపేట అంటూనే మంత్రి కోరిక మేరకు ఇప్పుడు నిర్మించిన భవనాల కంటే అద్భుతంగా నిర్మించుకునేలా రూ. 25కోట్లతో కళాభారతి మంజూరు చేస్తున్నట్లు” సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మంత్రి అడిగిన ప్రకారంగా క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ స్కూల్, అద్భుతమైన స్టేడియం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు పక్కా భవనాన్ని మంజూరు చేయిస్తానని, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కూడా నిర్మిస్తామంటూ అక్కడే ఉన్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి జీఓ జారీ చేయాలని ఆదేశించడం గమనార్హం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్నికలు రాగానే వరి కల్లాల వద్ద పంటను అడుక్కునేందుకు వచ్చేటోళ్ల లెక్క కాంగ్రెస్, బీజేపోళ్లు మళ్లీ బయల్దేరుతారని సీఎం కేసీఆర్ చెప్పారు. “సూర్యాపేట నుంచి రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను చెప్పే నాలుగు మాటలను ఇక్కడే విడువకుండా నా మాటలపై గ్రామంలో చర్చ పెట్టాలి. నేను ఒకటే కోరుతున్నా ఇక్కడ బరీలో ఎవరున్నారు.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు కొత్తవాల్లా.. ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నరు.. 50 ఏండ్లు ప్రజలు అవకాశం ఇచ్చినరు. కేసీఆర్ కంటే దొడ్డుగున్నోళ్లు, పెద్దగున్నళ్లు మంత్రులు, ముఖ్యమంత్రుల అయ్యారు. ఏమైనా చేశారా… ఒక మెడికల్ కళాశాల తెచ్చారా.. సూర్యాపేట మునుపెట్లుంది ఇప్పుడేట్లుంది.” అంటూ అడిగారు. మనకు కులం మతం లేదు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నాం” అని సీఎం కేసీఆర్ అన్నారు.
నల్లగొండను కాపాడింది సీఎం కేసీఆరే..
‘దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలను కాపాడింది ముఖ్యమంత్రి కేసీఆరే. ఒకప్పుడు నాగరికతతో విరాజిల్లిన ఈ ప్రాంతం సమైక్య పాలనలో 60 ఏండ్లు వెనక్కిపోయింది. సీఎం కేసీఆర్ కృషితో మిషన్ భగీరథ నీటి వల్ల ఫ్లోరైడ్ భూతం తరలిపోయింది. ప్రాజెక్టుల నుంచి నీళ్లు కాల్వల్లో గలగలా పారుతున్నాయి. అడుగడమే తరువాయిగా వేల కోట్ల రూపాయలు ఇవ్వడంతో జరుగని అభివృద్ధి లేదు. అభివృద్ధి విషయంలో నాటి, నేటి పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకుంటున్నరు. కాళేశ్వరం జలాల రాక సూర్యాపేట జిల్లా ప్రగతిని పెంచింది. పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అడ్డు కోవడం తప్ప అభివృద్ధి తెలియని విపక్షాలకు మూడోసారి కూడా కర్రు కాల్చి వాత పెట్టాలి. రాబోయే ఎన్నికల్లోనూ మళ్లీ బీఆర్ఎస్దే అధికారం. కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు.’
– ప్రగతి నివేదన సభలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి