హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం.. ప్రతిరోజు వేల మంది దర్శనం.. కోట్లలో ఆదాయం.. కానీ, కనీస వసతులు మృగ్యం. పైగా భక్తుల దోపిడీ అనంతం. ఇది నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షేత్రం దుస్థితి. ఈ శైవ క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉన్నా కనీస వసతులు లేకపోయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈ క్షేత్రంపై రాత్రివేళ నిద్రచేసి ఉదయం స్వామివారిని దర్శించు కుంటే అనారోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే అమావాస్య, పౌర్ణమి, సెలవు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఆ రోజు ల్లో గుట్టపై నిద్రించడానికి కొంచెం స్థలం కూడా దొరకదు అంటే అతిశయోక్తి కాదు. భక్తులు వచ్చే వాహనాలతో ఘాట్ రోడ్డు నిండిపోతుంది.
గుట్టపై ముఖ్యంగా ఉచిత మరుగుదొడ్లు లేక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉన్న చిన్నపాటి సులభ్ కాంప్లెక్స్ భక్తుల సంఖ్యకు ఏమాత్రం సరిపోవడం లేదు. ముఖ్యంగా మహిళలు చెప్పుకోలేని విధంగా బాధపడుతున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి గంటల తరబడి లైన్లలో నిల్చోవాల్సి వస్తున్నది. నిర్వాహకులు ఒక్కొక్కరి నుంచి రూ.10 తీసుకుంటున్నా.. నిర్వాహణ కూడా సక్రమంగా ఉండటం లేదు. అనేక గదులకు విద్యుత్తు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ బాధ తాళలేక అనేక మంది నీళ్ల బాటిళ్లతో గుట్ట చుట్టపక్కల కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు. ఫలితంగా ఆలయ ప్రాంతం అంతా కంపుకొడుతున్నది. ఘాట్ రోడ్డులో రెండుచోట్ల తాత్కాలికంగా మరుగుదొడ్లు నిర్మించినా నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి.
చెర్వుగట్టుపై పారిశుధ్య నిర్వహణ ఘోరంగా ఉన్నది. కొబ్బరి చెక్కలు ఎండబెట్టిన పక్కనే చెత్తకుప్పలు దర్శన మిస్తున్నాయి. ఇక కోనేరు పరిస్థితి మరీ దారుణం. భక్తులు స్నానాలు ఆచరించే కోనేరు నీళ్లు నల్లగా, కంపుకొడుతున్నాయి. అందులోకి దిగితే పాకూరు పట్టి జారుతున్నది. కాళ్లకు గుడ్డలు, ఇతర దుస్తులు తగులుతున్నా యి. డైపర్లను, డ్రాయర్లు కొందరు భక్తులు కోనేరులో, మరికొందరు దాని పక్కనే పడేస్తున్నారు.
చెర్వుగట్టులో కొందరు వ్యాపారులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. భక్తులు తలనీలాల టికెట్కు రూ.50 చెల్లిస్తే.. క్షురకులు మరో రూ.50 డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి మెహమాటం లేకుండా రూ.50 ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ దేవస్థానంలో లేని విధంగా చెర్వుగట్టులో మాత్రం ఒక్క కొబ్బరికాయ రూ.50కి విక్రయిస్తున్నారు. చెర్వుగట్టు కింద ఆలయంలో కోడె మొక్కుల వద్ద టికెట్ ధర చెల్లించినప్పటికీ వివిధ వర్గాలవారు అదనంగా డబ్బులు దండుకుంటున్నారు. చెర్వుగట్టు వచ్చే భక్తులు కనీస వసతులు పొందకపోగా దారుణ దోపిడికి, అసౌకర్యానికి గురవుతున్నారు.
చెర్వుగట్టులో 50 మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం, నిధులు కూడా మంజూరయ్యాయి. ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టడం లేదు. కోడ్ ముగియగానే మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతాం. చెర్వుగట్టుకు డ్రైనేజీ సమస్య ఉన్నదని, ఈ విషయమై గ్రామస్తులతో చర్చలు జరపుతున్నాం. కోనేరును 15 రోజులకు ఒకసారి శుభ్రం చేస్తామని, కొందరు భక్తులు పసుపు కుంకుమలతో అలాగే కోనేరులోకి దిగడం వల్ల 2-3 రోజులకే నీళ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయి. గ్రామ పంచాయతీ వేలం కారణంగా గుట్ట కింద రూ.50 కొబ్బరికాయ విక్రయిస్తున్నారని, గుట్టమీద రూ.40కే విక్రయిస్తున్నారు. పారిశుధ్య సమస్యను పరిష్కారిస్తాం – సిరికొండ నవీన్, ఆలయ ఈఓ