నల్లగొండ, మార్చి 4 : సమాచారం లేకుండా విధులు బహిష్కరించారనే కారణంతో 134 మంది పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం నల్లగొండ జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య చార్జ్ మెమోలు జారీ చేశారు. ఇప్పటికే కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ ఏడాది జనవరి 17న 99 మంది, అంతకుముందు 24 మంది మొత్తం 123 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వటంతోపాటు సర్వీస్ బ్రేక్ చేసి వారిని సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఆ 123 మందితోపాటు మరో 11 మందిని కలిపి మొత్తం 134 మందికి తాజాగా డీపీఓ వెంకయ్య చార్జ్ మెమో ఇచ్చి వివరణ కోరారు.
జిల్లాలో 864 గ్రామ పంచాయతీలు ఉండగా ఆయా గ్రామాల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. గతేడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు కొంత మంది పలు కారణాలతో సెలవు పెట్టి విధులు మానేశారు. వారిలో కొందరు ఆరోగ్య సమస్యలు, మరికొందరు ఇతర ఉద్యోగాలకు ప్రిపరేషన్, తదితర కారణాలతో నెల రోజుల నుంచి 11నెలల వరకు సెలవు పెట్టి వెళ్లారు. వారు 2023 డిసెంబర్, 2024 జనవరిలో రీజాయినింగ్ కోసం వెళ్లగా డిసెంబర్లో 24 మందిని, జనవరిలో 11న మరో 99 మందిని మొత్తం 123 మంది సెలవు కాలాన్ని సర్వీస్ బ్రేక్ చేస్తూ కలెక్టర్ త్రిపాఠి ఆర్డర్ ఇచ్చారు. అంతేగాక సెలవు కాలాన్ని బట్టి వారికి సుదూర ప్రాంతాలకు రీ పోస్టింగ్స్ ఇచ్చారు.
నల్లగొండ జిల్లాలో మినహాయిస్తే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇలాంటి సర్వీస్ బ్రేక్ చేయకుండా డ్యూటీలు ఇచ్చారని, మరికొన్ని జిల్లాల్లో షోకాజ్ లేదా బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చారని అప్పట్లో కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో ఆరు నెలల్లోపు వచ్చిన వారికి అదే పోస్టింగ్ ఇవ్వగా, అంతకు మించి పెట్టిన వారికి మాత్రం అప్పట్లో స్థాన చలనం చేశారు. అయితే నల్లగొండలోనే ఈ నిబంధన ఎందుకు అని కార్యదర్శుల ఆవేదన. ఇతర ఉద్యోగాలకు ప్రిపరేషన్ కోసం హక్కులేదా, సెలవు పెడితే ఎందుకు ఇవ్వలేదు, పెడితే బదిలీ చేయండి, కానీ సర్వీస్ బ్రేక్ ఎందుకు? అని అప్పట్లో కార్యదర్శులు అధికారులకు తెలిపారు. ఇదిలా ఉండగా తాము పలు కారణాలతో సెలవు కావాలని ఎంపీఓ, డీపీఓలకు లెటర్లు ఇస్తే తీసుకోలేదని, గత్యంతరం లేక రిజిస్టర్ పోస్టు కూడా చేశామని అంటున్నారు.
ఒక్కొక్క పంచాయతీ కార్యదర్శి సమాచారం లేకుండా రెండు నెలల నుంచి 11నెలల వరకు సెలవు పేరుతో డ్యూటీ ఎగ్గొట్టారు. ప్రొసీజర్ ప్రకారం 134మందికి అప్పుడు షోకాజ్ ఇచ్చి ఇప్పుడు విచారణ చేయడానికి చార్జీ మెమోలు ఇచ్చాం. నిబంధనల ప్రకారమే విచారణ చేసి చర్యలు తీసుకొని బదిలీ ప్రక్రియ చేస్తాం.