మునుగోడు, మే 30 : భారత కమ్యూనిస్టు పార్టీ మునుగోడు మండల 15వ మహాసభ సింగారం గ్రామంలో గురువారం ఘనంగా జరిగింది. ఈ మహాసభలో మండలంలోని వివిధ సమస్యలపై చర్చించి మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ మండల కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన చాపల శ్రీను మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జిల్లా కార్యవర్గ సభ్యుడు గురిజా రామచంద్రం శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు చాపల శ్రీనుకు శుభాకాంక్షలు తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చాపల శీను తెలిపారు.