– ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి
నల్లగొండ సిటీ, మార్చి 21 : విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసి రక్షణ, కార్మికుల ఉద్యోగులకు ఎసరు వస్తుందని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పుల కోసం ఐక్య పోరాటం జరగాల్సిన అవసరం ఉందని, ఐక్య పోరాటాల ద్వారానే “ఆర్టీసీ రక్షణ -కార్మికుల హక్కుల పరిరక్షణ” సాధించుకోగలుగుతామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ఎస్ డబ్ల్యూ ఎఫ్ నల్లగొండ డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య అన్నారు. శనివారం నల్లగొండ ఆర్టీసీ డిపో ఆవరణంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, విద్యుత్ బస్సులను ఆర్టీసీకి కేటాయించాలనే డిమాండ్ బ్యానర్ పై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్, ఆర్టీసియే నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉద్యోగ భద్రత, విద్యుత్ బస్ ల విధానాల్లో మార్పు, కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయకపోగా, ప్రైవేట్ విద్యుత్ బస్సుల విధానాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ బస్ లను సమకూర్చుకొంటున్నది. ఈ విధానంలో మార్పు జరగకుండా, ఆర్టీసీలు తమ మనుగడ సాగించడం కష్టమని ఉద్యోగులకు ముప్పు వస్తుందన్నారు.
విద్యుత్ బస్ ల విధానంలో మార్పు కోసం ఆర్టీసిలోని అన్ని కార్మిక సంఘాలు సమైక్య ఆందోళనకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రజా రవాణా సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడాన్ని ఎస్ డబ్ల్యూ ఎఫ్ వ్యతిరేకిస్తున్నదని, ఆ పద్ధతిని మార్చాలని డిమాండ్ చేశారు. కార్మికులపై విపరీతమైన పని భారం మోపిందన్నారు. కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈనెల 24న అన్ని డిపోల ముందు జరుగే ధర్నాలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాణాల పరిపూర్ణాచారి, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జంజరాల శ్రీనివాస్, టిజేఎస్ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి, ఎస్ డబ్ల్యూ ఎఫ్ రీజయన్ అధ్యక్షుడు కందుల నరసింహ, సహాయ కార్యదర్శి కే.శ్యాంసుందర్, డిపో కార్యదర్శి ఎస్.కె గులాం రసూల్, పి.వెంకటేశ్ పాల్గొన్నారు.