– సర్వేలన్నీ అనుకూలం
– బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ బెదిరింపులు ఆపాలి
– మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు, ఫిబ్రవరి 04 : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మునుగోడు నియోజకవర్గం, చండూరు మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి శూన్యం అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చండూరు మున్సిపాలిటీలో విలేకరులతో మాట్లాడారు. సర్వే రిపోర్టులు అన్ని బీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయన్నారు. అందుకే రెండు ఎక్స్ ఆఫీసీయో ఓట్లు చండూరులో పెట్టుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అభ్యర్థులను ప్రచారం చేయకుండా బెదిరింపులకు గురించేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. రాని మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పదే పదే పాకులాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాను మంజూరు చేయించిన నిధుల్లో ఇంకా రూ.6 కోట్లు ఎమ్మెల్యే ఖర్చు చేయలేకపోతున్నారని, ఆయన అవగాహన రహితం వల్ల చండూరులోని డబుల్ రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందన్నారు. ఒకసారి అధికారులతో రివ్యూ పెడితే పనులన్నీ పూర్తి అవుతాయి కానీ దానిపై దృష్టి పెట్టడం లేదన్నారు. భజనపరులను వెంబడేసుకుని ఆయన భజనకే తప్పా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు ధ్యాస లేదన్నారు. చేతగాని ఎమ్మెల్యేను గెలిపించుకున్నామని చండూరు ప్రజలు బాధపడుతున్నారన్నారు. గతంలో తాము పనులు చేసుకుంటూ పొతే ఇప్పుడు ఎమ్మెల్యే ప్రతీకార రాజకీయాలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో ఓడిపోతున్నామని కాంగ్రెస్ పైసలను నమ్ముకుందని, తాము మాత్రం ప్రజలనే నమ్ముకున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను ఓడించి బీఆర్ఎస్ కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. అనంతరం మున్సిపాలిటీలోని 1వ వార్డు, 3వ వార్డులో వివిధ పార్టీల నుండి 60 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వారందరికీ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, బొడ్డు సతీష్ గౌడ్, గోపిడి వెంకట్ రెడ్డి, చొప్పరి దశరథ, సామ యాదవ రెడ్డి పాల్గొన్నారు.

‘చండూరు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్దే’