– రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం
– కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజు
మిర్యాలగూడ, మే 18 : ఇటీవల మిర్యాలగూడ పట్టణంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల పట్టణంలోని అద్దంకి- నార్కట్పల్లి రహదారి సమీపంలో వైష్ణవి అపార్ట్మెంట్ వద్ద సిసి రోడ్డుపై ఇద్దరు మహిళలు వాకింగ్ చేస్తుండగా బైక్పై ముసుగు ధరించి వచ్చిన వ్యక్తి ఓ మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సిఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం ముడివేముల గ్రామానికి చెందిన గొట్టిముక్కల నాగ చిన్న వెంకటేశ్వర్లుగా గుర్తించారు. బెట్టింగులకు, జల్సాలకు అలవాటు అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు చైన్స్ స్నాచింగ్ చేయాలని భావించి మిర్యాలగూడ పట్టణంలో చైన్స్ స్నాచింగ్ చేసి పరారీ అయ్యాడు.
నిందితుడు మరోసారి మిర్యాలగూడ పట్టణంలో చైన్ స్నాచింగ్ చేసేందుకు వచ్చినట్లు గుర్తించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు ఇదివరకు తిరుపతి పట్టణంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేయగా అక్కడ పట్టుబడి కేసు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లినట్లు చెప్పారు. అనంతరం నకిరేకల్ పట్టణంలో కూడా చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు వివరించారు. నిందితుడి నుండి బంగారు పుస్తెలతాడు, ఒక యమహా బైక్, సెల్ ఫోన్, టోపీ మాస్కులను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. నేర పరిశోధనలో ప్రతిభ కనబరిచిన సీఐ నాగభూషణరావు, స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.