రామగిరి, ఏప్రిల్ 27 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కుట్రలు, కుతంత్రాలతోనే మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టిందని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి విమర్శించారు. సిపిఐ నల్లగొండ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డీలిమిటేషన్‌కు 2031 సంవత్సరం వరకు గడువు ఉన్నప్పటికీ, 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలతో డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చిందని మండిపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా, శాస్త్రీయ పద్ధతిలో డీలిమిటేషన్ జరగాలని అభిప్రాయపడ్డారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు వడ్లను పూర్తిగా ఎండబెట్టి, తేమ లేకుండా తీసుకువచ్చినప్పటికీ తాలు పేరుతో క్వింటాలుకు 5 నుంచి 6 కిలోల వరకు కోత విధించడం అన్యాయమని మండిపడ్డారు. అదనపు తూకం, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పెట్టుబడులతో ఇబ్బందులు పడుతూ పెద్దఎత్తున వరి ధాన్యాన్ని పండించి రైతులు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తున్నప్పటికీ, కొనుగోలు ప్రక్రియలో అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతుల శ్రమను దోపిడీ చేసే ఈ చర్యలను ప్రభుత్వం తక్షణమే అరికట్టి కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మే 1వ తేదీన అన్ని గ్రామాలు, పట్టణాలు, కార్మిక అడ్డాల్లో ఎర్ర జెండాలు ఎగురవేసి ర్యాలీలు, సభలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి గురిజ రామచంద్రం అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, ఉజ్జిని యాదగిరి రావు, ఆర్.అంజయ్యచారి, బంటు వెంకటేశ్వర్లు, టి.వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య, తుమ్ము బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.