కోదాడ రూరల్/అనంతగిరి/నడిగూడెం/హుజూర్నగర్, సెప్టెంబర్ 12 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం జిల్లాకు కేంద్ర బృందం వచ్చింది. కోదాడ, అనంతగిరి, నడిగూడెం, హుజూర్‌నగర్‌తోపాటు పలు మండలాల్లో పర్యటించింది. మునిగిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, కూలిన ఇండ్లను పరిశీలించింది. ఈ సందర్భంగా వరద బాధితులు కేంద్ర బృందానికి తమకు నష్టాన్ని వివరించారు. తాము అన్ని విధాలా కోల్పోయామని, ప్రభుత్వ తరపున ఆదుకోవాలని వేడుకున్నారు.
జిల్లాకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు రెండు టీములుగా విడిపోయి వరద ప్రాంతాల్లో పర్యటించారు. మొదట అనంతగిరి మండలం గోండ్రియాల, రంగాపురం గ్రామాల్లో బృంద సభ్యులు కేపీ సింగ్, మహేశ్‌కుమార్, శాంతినాథ్, శివప్ప ముంపు ప్రాంతాలను పరిశీలించారు. గోండ్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శివాలయం, ఎస్సీ కాలనీలను సందర్శించి అక్కడి గృహస్తులతో మాట్లాడి వరద నష్టాన్ని తెలుసుకున్నారు. గ్రామంలో జరిగిన నష్టంపై మండల అధికారుల నుంచి నివేదిక సేకరించారు. అనంతరం కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడి గ్రామాల్లో పర్యటించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. తొగర్రాయిలో ప్రహరి కూలిన నామాల సాయిలు ఇంటిని పరిశీలించి, రైతు పోతురాజు నర్సయ్య ద్వారా వరద తీరును అడిగి తెలుసుకున్నారు.
వరద తాకిడికి ఇంటి సామగ్రి కోల్పోయిన బాధితులరాలు వంగాల మమతతోపాటు అందరికీ నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. వారికి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పంట నష్టం, రోడ్ల పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని పరిశీలించారు. అధికారులను కారణాలు అడిగి వివరాలను తెలుసుకున్నారు. నీట మునిగిన పొలాలు, ఇసుక మేట వేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువు రైతుల కేంద్ర బృంద సభ్యులకు భారీ వర్షాల తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని కోరారు.
హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో రాకేష్మీనా ఆధ్వర్యంలో మరో కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు. నల్ల చెరువును పరిశీలించి నష్టం వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్మీనా మాట్లాడుతూ బురుగడ్డ, గోపాలపురం రెండు గ్రామాల మధ్య ఆర్సీపీ బిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. కేంద్ర బృదం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కేంద్ర బృందానికి పలు వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేసి వివరించారు.వారి వెంట జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి, ఆర్డీఓలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, ఇరిగేషన్ డీఈ రఘు, తాసీల్దార్లు నాగేంద్రబాబు, హిమబిందు, ఎంపీడీఓ సుష్మ, ఏడీ రాజు, ఏఓ స్వర్ణ, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, దొంగరి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.