తుంగుతుర్తి, జూన్ 01 : దేశంలోనే నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విఫలమైందని సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని సీపీఎం మండల కమిటీ సమావేశం సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రజల జీవన వ్యయం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ మతం, కులం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆకర్షణీయమైన హామీలు ఇస్తూ ప్రజల ఓట్లను పొందిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికే అనేక సార్లు పెంచడం వల్ల సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గిన సందర్భాల్లో కూడా దేశీయంగా ఇంధన ధరలను తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. విదేశాంగ, ఆర్థిక విధానాల్లో స్వతంత్ర నిర్ణయాల కంటే ఇతర దేశాల ఒత్తిళ్లకు లోనవుతూ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిచేటి యాదగిరిరావు, మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాసు, మండల కమిటీ సభ్యులు పల్లా సుదర్శన్, ముత్తయ్య, ఎల్లయ్య, సోమయ్య, యాదగిరి, జానయ్య పాల్గొన్నారు.