చండూరు, ఆగస్టు 25 : తెలంగాణ రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యావని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని చండూరు వ్యవసాయ అధికారి చంద్రికకు సిపిఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడా యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్ర రైతాంగానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముండగా, ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే రావడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియాపై పోరాడకుండా కండ్లప్పగించి చూస్తూ, రైతులను ఇబ్బందులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు లేకపోవడం వల్ల గ్రామాల్లో ప్రజా సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకపోయాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం యూరియా కోసం బారులు తీరుతున్నారని, అనేకమంది అస్వస్థకు గురై అనారోగ్యం పాలవుతున్నారన్నారు. యూరియా కొరతే లేదని అధికారులు చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు సరిపడా యూరియాను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోగుదాల వెంకటేశం, చిట్టిమల్ల లింగయ్య, నారపాక శంకరయ్య, ఇ.వెంకటయ్య, యాదయ్య, నరసింహ, రైతులు నారపాక అశోక్, జలంధర్, మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు.