రామన్నపేట, జూన్23 : రామన్నపేటలో ఏర్పాటు చేయతలపెట్టిన అదానీ సిమెంటు ఫ్యాక్టరీని బీఆర్ఎస్తో పాటు సబ్బండవర్గాలు పోరాటం చేసిన ఫలితంగానే ఉపసంహరించుకున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కాంగ్రెస్ నాయకులు తామే రద్దు చేయించినట్లు పాలభిషేకాలు చేసుకుంటూ సంబురాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. మంగళవారం ఆయన రామన్నపేటలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పలు పార్టీల నాయకులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, కుల సంఘాలు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమించి, కలెక్టరేట్ ఎదుట ధర్నా, వినతి పత్రాలు ఇచ్చి అందోళనలు చేపట్టినందునే ఫ్యాక్టరీ ఏర్పాటును యాజమాన్యం ఉపసంహరించుకుందన్నారు.
పబ్లిక్ హియరింగ్ రోజున తాను రాకుండా అరెస్టు చేశారన్నారు. ప్రజా ఆగ్రహాన్ని చవిచూసిన ఫ్యాక్టరీ యాజమాన్యం సంవత్సర క్రితమే ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేసుకుందన్నారు. కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి ఫ్యాక్టరీని తామే అడ్డుకున్నామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికి మండలంలో కొన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని, యూరియా దొరకడం లేదని, రైతు బంధు వేయడం లేదని, నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
మండలంలోని నీర్నేములకు చెందిన కన్నెబోయిన కిష్టయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. విషయం తెలుసుకున్న చిరుమర్తి కిష్టయ్య మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన మైత్రి, బంగారు గళ్ల బాలరాజు మృతదేహాలపై పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పోశబోయిన మల్లేశం, సర్పంచ్‌లు కంభంపాటి శ్రీనివాస్, గర్దాసు విక్రం, మాజీ ఎంపీటీసీలు వేమవరపు సుధీర్‌బాబు, పున్న వెంకటేశం, నాయకులు బద్దుల రమేష్, ఎస్కే చాంద్, ఆమేర్, జాడ సంతోష్, బొడ్డు అల్లయ్య,ఏజాజ్, అమరేందర్‌రెడ్డి, చిన్నపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.