తిరుమలగిరి నవంబర్ 14: రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. దళారులు, వ్యాపారుల దోపిడీ మాత్రం కళకళ లాడుతోంది. రైతుల పక్షాన నిలవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో దళారులకు, వ్యాపారులకు కొమ్ము కాస్తుండటంతో వారి దోపిడీ మూడు పువ్వులు..ఆరు కాయలు అన్న చందనంగా సాగుతోంది. తిరుమలగిరి చౌరస్తాలోని నాలుగు కూడళ్లలో వ్యాపారులు అనుమతులు లేకుండా పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తూ దగా చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మండలంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారులు పత్తి రైతులకు మాయ మాటలు చెబుతూ మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. గ్రామాల్లోనే కాంటాలు వేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. తిరుమలగిరిలో గత నెల 27న సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు 2 వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అదే ప్రైవేటు వ్యాపారులు మాత్రం 60 వేల క్వింటాళ్ల వరకు పత్తి కొనుగోళ్లు చేసినట్లు అంచనా. ఈ సంవత్సరం తెల్లబంగారం రైతులకు కలిసి రాలేదు. పూత కాత దశలో అధిక వర్షాల కారణంగా పత్తి పంట ఎర్రబారి, గూడలు రాలి దిగుబడి తగ్గింది. ఇది వ్యాపారులకు వరంగా మారింది. నల్లబడిన పత్తిని క్వింటాల్‌కు రూ.3,500 నుంచి రూ.4 వేల వరకే కొనుగోలు చేస్తూ రైతులను దగా చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం ట్రేడింగ్ లైసెన్స్ కలిగిన వ్యాపారులే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. విధిగా ఎలక్ట్రానిక్ కాంటాలనే వినియోగించాలి. బాట్లు, కాంటాలకు తూనికలు, కొలతల శాఖ అధికారుల ముద్రలు లేకుండానే లైసెన్స్‌లేని వ్యాపారులు, దళారులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు గ్రామాల్లో దళారుల ఆటలు కట్టించి న్యాయం చేయాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.
ఈసారి జిల్లా వ్యాప్తంగా 93 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తే.. ఇప్పటి వరకు 6 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇందులో రెండోవంతు రైతులు మాత్రమే సీసీఐ కొనుగోలు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. నాలుగోవంతు రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం తేమశాతం నిబంధనతో పాటు కిసాన్ కపాస్ ఆన్లైన్ ఇక్కట్లు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. పత్తి మిల్లులు లీజుకు తీసుకున్న యజమానులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొనుగోళ్లు లేక సీసీఐ కొనుగోలు కేంద్రాలు వెలవెల పోతున్నాయని పత్తి మిల్లులను లీజుకు తీసుకున్న వ్యాపారులు వాపోతున్నారు.