కోదాడ, జూన్ 21 : నేర నివారణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. శనివారం కోదాడ పట్టణ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో రూ.27.50 లక్షలతో ఏర్పాటు చేసిన 73 సీసీ కెమెరాల పోలీస్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని శాంతి భద్రతలను పరిరక్షించాలన్నారు. సీసీ కెమెరాల ఉపయోగంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అన్నారు. నేరస్థులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. రాత్రి సమయాల్లో అల్లరి మూకలను, సంఘ విద్రోహ శక్తులను, ప్రమాదాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐలు శివశంకర్ నాయక్, రజితా రెడ్డి, టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, భరత్ రెడ్డి, డాక్టర్ సుబ్బారావు, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, నాగుబండి రంగా, డాక్టర్ అందే సత్యం, మేళ్లచెరువు కోటేశ్వరరావు, కొమరగిరి రంగారావు పాల్గొన్నారు.