సూర్యాపేట, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను మాయం చేసిన అక్రమార్కులపై విచారణకు సీబీఐ రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కోసం జిల్లాలోని మిల్లర్లకు ఇస్తుండగా ఓ పది మిల్లులు తీసుకున్న దాదాపు రూ.515 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మాయం చేశాయి. రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆర్ఆర్ యాక్ట్‌తోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి మిల్లులు సీజ్ చేయడంతోపాటు మిల్లర్లను జైలుకు పంపారు. కానీ, మిల్లర్లు మాత్రం చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరా చేసుకుని బెయిల్‌పై వచ్చిన తరువాత మిల్లులను యథావిధిగా తెరిచి వ్యాపారం చేస్తున్నారు.
దాంతో ఓ ఎన్జీఓ కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రంగంలోకి దిగిన సీబీఐ అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల సమాచారం తీసుకొని ప్రాథమిక విచారణ పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. సూర్యాపేట జిల్లాలో మిల్లర్లకు నాయకుడిగా ఉన్న వ్యక్తి మరో పదిమందితో పానల్ తయారు చేసి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యాన్ని ఖతం పట్టించిన విషయం విదితమే. అధికారులు అడిగినంత ఇచ్చి వందల కోట్ల రూపాయల ధాన్యాన్ని మాయం చేసినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు తనిఖీలు చేసినా సదరు మిల్లుల్లో ధాన్యం ఉన్నట్లు రికార్డుల్లో చూపించడం, ఆయా మిల్లుల నుంచి సీఎంఆర్ రాకున్నా పట్టించుకోకపోవడంతో పది మిల్లుల బకాయి పెద్దఎత్తున పోగుపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాలేశ్వరం ప్రాజెక్టును పండబెట్టడం, నీటి నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కరువు చాయలు అలముకున్నాయి. దాంతో పంట తగ్గి మిల్లులకు ధాన్యం వెళ్లకపోవడంతో మిల్లర్ల పాపాల పుట్టలు పగులుతూ వచ్చాయి. సీబీఐ ఇప్పటికే సూర్యాపేట అధికారుల నుంచి ప్రాధమికంగా వివరాలు సేకరించిందని, త్వరలోనే అక్రమాలకు పాల్పడిన మిల్లర్లతోపాటు వారికి సహకరించిన అధికారులకు కూడా విచారణ తప్పదని అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. విచారణ ఎలా ఉంటుంది, తిన్న సొమ్మంతా కక్కిస్తారా? కేసులు తప్పవా? అని అక్రమార్కులు బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం.