మునుగోడు, ఏప్రిల్ 25 : మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో దళిత ఎస్సీ మహిళా సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మపై కుల వివక్షత పేరుతో, అంటరానివారిగా అవమానిస్తూ గ్రామంలోని ఒక వర్గం అధికార బలంతో పెత్తందారి పోకడలు పోతూ సర్పంచ్ కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామ పండగలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ స్థానిక తాసీల్దార్ నరేశ్, ఎంపీడీఓ యుగంధర్ కి శనివారం వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మ మాట్లాడుతూ.. తాను సర్పంచ్ గా ఎన్నిక అయినప్పటి నుండి వివిధ కార్యక్రమాల్లో వివక్ష చూపుతూ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామంలో ఈ నెల 26న శ్రీ కేదారేశ్వర స్వామి 17వ బ్రహ్మోత్సవాలకు తనకు ఎలాంటి సమాచారం లేకుండానే బ్రహ్మోత్సవాల నిర్వహణ తేదీని ఖరారు చేశారని, అంతేగాకుండా తనకు ఎలాంటి సమాచారం లేకుండానే గ్రామంలో డప్పు సాటింపు వేయించినట్లు తెలిపారు. తాను నామినేటెడ్ పోస్టులో ఎన్నిక కాలేదని ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రతినిధిగా గ్రామంలో ఉన్నానని తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా అనే అక్కస్సుతోనే ఆలయ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు తమకు ఎలాంటి సమాచారం లేకుండా పెత్తందారి పోకడలు అవలంభిస్తున్నట్లు తెలిపారు.

కల్వకుంట్ల సర్పంచ్ పట్ల కుల వివక్షత
ఈ సంవత్సరం శివరాత్రి పండగ సందర్భంగా ఆలయం పరిసరాల్లో స్వయంగా తానే శుభ్రం చేయించానని, కనీసం శివరాత్రి పండుగ సందర్భంగా దేవాలయంలోకి కూడా తనను ఆహ్వానించ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికలో గెలిచిన అనంతరం గ్రామ ప్రజలకు గ్రామంలో ముత్యాలమ్మ దేవస్థానం నిర్మాణం చేస్తానని మాట ఇచ్చానని ఆ మాట ప్రకారంగానే గుడి నిర్మాణం చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ కూడా తమను అడ్డుకుని నాన్న ఇబ్బందులకు గురిచేసిన విషయాలను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి వివక్షతలకు ఎలాంటి తావు లేకుండా చూడాలని, ఇలాంటి వివక్షతలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ అయితగోని యాదయ్య, అఖిలపక్ష నాయకులు సింగపంగా ఎల్లయ్య, మాదరబోయిన పరమేష్, సింగపంగా జయకృష్ణ, కట్ట లింగస్వామి, సింగపంగా అశోక్, సింగపంగా నరేష్, సింగపంగా మధుకర్, పగిళ్ల సాయి తేజ పాల్గొన్నారు.