కట్టంగూర్, జూన్ 04 : కుటుంబ పోషణ కోసం హైదరాబాద్లో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్న యువకుడు గురువారం తెల్లవారుజామున కట్టంగూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతే మండలం నామారం గ్రామానికి చెందిన శివరాత్రి వేణు కుమార్ (25) ట్యాక్సీ కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 3న ప్రయాణికులను హైదరాబాద్ నుండి విజయవాడకు తీసుకెళ్లిన వేణు, అక్కడి నుండి అదేరోజు రాత్రి పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆరుగురి కార్మికులతో తిరిగి హైదరాబాద్కు బయల్దేరాడు.
గురువారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా కట్టంగూర్ గ్రామ శివారులోని రామాంజనేయ స్వామి ఆలయం సమీపానికి చేరుకోగానే ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వేణు కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. వేణుకుమార్కు భార్య, కుమారుడు ఉన్నారు.