మాల్, ఏప్రిల్ 17 : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పోలేపల్లి రాంనగర్ గేట్ సమీపంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు లారీని ఢీ కొట్టిన సంఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేపల్లి నుండి హైదరాబాద్ వైపు టీఎస్ 06 ఎఫ్ సి 1728 నెంబర్ గల కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుండి మల్లేపల్లి వైపు వెళ్తున్న టి ఎన్ 04 ఏ ఆర్ 23 72 లారీని చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గేట్ సమీపంలో కారు బలంగా ఢీకొనడంతో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెంది కారులోనే ఇరుక్కుపోయాడు. మరో వ్యక్తికి గాయాలు కావడంతో మాల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న చింతపల్లి ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.