నల్లగొండ ప్రతినిధి, మే1(నమస్తే తెలంగాణ) : మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడంలో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వ మంజూరు చేసిన పనులకు కొత్తగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఇవి తమ ప్రభుత్వానివేనన్న బిల్డప్ ఇస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మునుగోడులో రెండేళ్ల కిందట ప్రారంభించిన ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయాన్ని బుధవారం మరోసారి ప్రారంభించడమే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు అధికారిక క్యాంప్ కార్యాలయాల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మునుగోడులోనూ చండూరు రోడ్డులోని ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. దీన్ని పూర్తి చేసే విషయంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి మూడేండ్లపాటు పట్టించుకోలేదు. 2022 నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు.
అసంపూర్తిగా ఉన్న క్యాంప్ కార్యాలయాన్ని ఆయన పూర్తి చేశారు. ఆరు నెలల్లోనే పూర్తి సకల వసతులతో తీర్చిదిద్దారు. అప్పటి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 2023 మే ఒకటిన లాంఛనంగా ప్రారంభించారు. నాటి నుంచి 2023 డిసెంబర్లో ఎన్నికలు జరిగే వరకు కూడా అప్పటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన రాజగోపాల్‌రెడ్డి ఏడాది పాటు అటువైపు కూడా చూడలేదు.
అప్పటికే స్థానికంగా ఓ ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసుకున్న క్యాంప్ కార్యాలయం నుంచే పని చేస్తూ వచ్చారు. ఆ స్థల యజమాని దాన్ని ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో అనివార్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన క్యాంప్ కార్యాలయంపై రాజగోపాల్‌రెడ్డి దృష్టి పడింది. దాంతో ఈ ఏడాది ప్రారంభంలో అందులో అదనపు సౌకర్యాల పేరుతో మరమ్మతులు చేపట్టారు. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ కార్యాలయాన్ని తామే నిర్మించినట్లుగా కొత్తగా శిలాఫలకం వేసి, తాజాగా బుధవారం దాన్ని ప్రారంభించి, అందులోకి ప్రవేశం చేసినట్లు హంగామా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాత శిలాఫలకం తొలగింపు…
2023 మే ఒకటిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యా లయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని రాజగోపాల్‌రెడ్డి పూర్తిగా తొలగించారు. దాని స్థానంలో కొత్తగా ఇప్పటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీల పేర్లతోపాటు తానే ప్రారంభిస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి పేరుతో రూపొందించిన శిలాఫలకం ఏర్పాటు చేశారు. కేవలం తనకు అవసరమైన అదనపు సౌకర్యాల ఆధునీకరణ పేరుతో మొత్తం క్యాంపు కార్యాలయాన్ని తామే నిర్మించినట్లు బిల్డప్ ఎందుకున్న ప్రశ్నలు నియోజకవర్గవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.
ఒక వేళ అదనంగా నిధులు వెచ్చించి నిర్మాణం చేస్తే పాత శిలాఫలకాన్ని అలాగే ఉంచి కొత్తగా మరొకటి ఏర్పాటు చేస్తే పెద్దగా అభ్యంతరాలు ఉండేవి కావంటున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులతో నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని పునాదుల నుంచి కాంగ్రెస్ సర్కారే నిర్మించి పూర్తి చేసినట్లు రాజగోపాల్‌రెడ్డి ఖాతాలో వేసుకునే చర్యలు సరికావని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
ఇక చండూరు మున్సిపాలిటీలో సైతం ఉప ఎన్నికల అనంతరం అప్పటి ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులకు స్వయంగా అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అప్పట్లో వీటికి సంబంధించిన శిలాఫలకాలను కూడా ఏర్పాటు చేశారు. వాటిని సైతం కనుమరుగు చేయాలనే కుట్రతో రోడ్డు విస్తరణ పనుల పేరుతో తొలిగించారు. తొలగించే సమయంలో స్థానికంగా అభ్యంతరాలు వెల్లడవగా, మరోచోట ఏర్పాటు చేస్తామని చెప్పి తొలగించారు. ఆ శిలాఫలకాలను ఏం చేశారో నేటికీ స్పష్టత లేదు.
ఇలా నియోజకవర్గవ్యాప్తంగా ఉప ఎన్నికల అనంతరం కేసీఆర్ సర్కారు మంజూరు చేసిన పనులనే నేటికీ కొనసాగిస్తూ వాటిని మంజూరు చేసిన ఆనవాళ్లను మాత్రం లేకుండా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాదిన్నర కాలంలో కొత్తగా చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పాత వాటికే కొత్తగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే కుట్రలను కాంగ్రెస్ నేతలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్న రాజగోపాల్‌రెడ్డి
మునుగోడు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. కొత్తగా తెచ్చిన నిధులు కూడా లేవు. విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన పనులకే కొత్తగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. మునుగోడులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేసీఆర్ ఇచ్చిన నిధులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది 2023 మేలోనే ప్రారంభించాం. ఇప్పుడు అదే కార్యాలయాన్ని తిరిగి కొత్తగా ప్రారంభించడం ఏంటో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. ఆయనేమీ చేయలేక, పాత పనులతోనే ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ రాజకీయాలను భ్రష్టుపట్టిస్తున్నాడు.
ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర కావస్తున్నా నేటికీ ఒక్క పని కొత్తగా మంజూరు చేయించలేదు. అన్నింటికీ మంత్రి పదవిని బూచిగా చూపుతూ కాలయాపన చేస్తున్నాడు. చివరకు మంత్రి పదవి రాదన్న వార్తలతో పిచ్చి లేచినట్లు ప్రవర్తిస్తున్నాడు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొత్తగా ప్రారంభించడం అందులో భాగమే. నియోజవర్గంపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కొత్తగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపాలి. లేదంటే ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం.
-కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే