అర్వపల్లి, నవంబర్ 27 : వరి కొయ్యలను కాలిస్తే భూమిలో జీవం హరిస్తుందని సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో పంట పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంట పొలాల్లో వరి కొయ్యలు కాల్చడం వల్ల నేలకు, పంటకి, ప్రజల ఆరోగ్యానికి భారీ నష్టం జరుగుతుందన్నారు. గడ్డి దహనం చేయడం వల్ల నేలలోని సుక్ష్మజీవులు నశిస్తాయని తెలిపారు. తీవ్ర వేడి వల్ల నేలలో సహజంగా ఉన్న నత్రజని కలిపే సూక్ష్మజీవులు, నేలకు బలాన్ని తెచ్చే బ్యాక్టీరియా, కార్బన్ నిల్వ చేసే జీవులు అన్నీ నాశనం అవుతాయన్నారు. పంట పెరుగుదలకి ప్రధాన ఆధారమైనవి నశిస్తే నేల బలహీనమై పండించే శక్తి తగ్గిపోతుందని తెలిపారు.
గడ్డి తగలబెట్టినప్పుడు కార్బన్డయాక్సైడ్, సీఓ, పీఎం 2.5 లాంటి హానికర కణాలు విడుదలై శ్వాసకోశ సమస్యలు, పిల్లలు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలతో పాటు వాతావరణ కాలుష్యం కలిగిస్తాయన్నారు. ఫలితంగా ఎరువుల ఖర్చు పెరిగి నేలపై ఉన్న సేంద్రీయ పొర పూర్తిగా కాలిపోతుందని వివరించారు. దీంతో నేల కఠినమై వేళ్లు లోపలికి వెళ్లడానికి ఇబ్బంది పడి పంట పెరుగుదల మందగించి దిగుబడి తగ్గిపోతుం దన్నారు. గడ్డిని పొలంలో కలిపి పచ్చి ఎరువుగా వాడటం వల్ల నేలకి సహజంగా కార్బన్, పోషకాలు తిరిగి చేరి నేల బలంగా మారుతుందని తెలిపారు. మల్చర్, హ్యాపీ సీడర్ ఉపయోగించి గడ్డిని చిన్న తరగులుగా చేసి నేలమీద పరిస్తే పోషకాలను పెంచడమే కాకుండా తడి ఎక్కువ రోజులు నిల్వ చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గణేశ్, వ్యవసాయ విస్తరణ అధికారులు శోభారాణి సత్యం, రైతులు పాల్గొన్నారు.