రామగిరి, నవంబర్ 26 : తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిన “దీక్షా దివస్”ను పురస్కరించుకుని, “కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో” ఉద్యమ స్ఫూర్తిని మరోసారి గుర్తుచేసుకుంటూ నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద బుధవారం బీఆర్ఎస్వీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. చరిత్రను మరలా గుర్తుచేస్తూ ఈ నెల 29న జరగబోయే దీక్షా దివస్ను విశ్వవిద్యాలయ పరిధిలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యా రంగ బలోపేతం, విద్యార్థుల హక్కుల సాధన, విశ్వవిద్యాలయ అభివృద్ధి ఇవన్ని ఉద్యమాలతోనే సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు గాదె శివ, పలువురు విద్యార్థి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.