రామగిరి, నవంబర్ 22 : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, బి.ఫార్మసీ, బీఈడీ, ఎంఈడీ, బీపెడ్ వంటి నూతన కోర్సులు, అలాగే కొత్త ప్రొఫెషనల్ కాలేజీలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంఓ శనివారం విద్యార్థుల సంతకాల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు వాడపల్లి నవీన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంత విద్యార్థుల కోసం నూతన ప్రొఫెషనల్ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలోనే అందుబాటులోకి రావాలన్నారు. కొత్త కాలేజీలు, కొత్త కోర్సుల కోసం ప్రభుత్వం వెంటనే రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలన్నారు. జిల్లా మంత్రి వెంటనే దీనిపై స్పందించి వచ్చే విద్యా సంవత్సరానికి ఆయా కళాశాలలను, కోర్సులను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకులు వాడపల్లి నవీన్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు గాదే శివ, విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.