BRSV : ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివెళ్తున్న బీఆర్ఎస్వీ నేతలను శనివారం నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేష్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నోముల క్రాంతి యాదవ్‌లను ముందస్తుగా అరెస్టు చేసి నిర్బంధించారు.
ఈసందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, మహిళా విద్యార్థినిలకు స్కూటీలు ఇవ్వాలని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ గురించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం, బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థుల హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరెస్టయిన విద్యార్థి నాయకులందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.