సూర్యాపేట, (నమస్తే తెలంగాణ)/ నల్లగొండ , ఏప్రిల్ 1 : గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసమో లేక గెలుపుపై ధీమానో కానీ మనం కొన్ని పొరపాట్లు చేసినం. వాటిని సవరించుకొని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మనదే సునాయసమైన గెలుపు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో అసంతృప్తి లేదని, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాల వల్ల ఆయా వర్గాలు మనకు దూరమయ్యారని తెలిపారు.
ఇప్పటికే వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రైతులు దుర్భర స్థితికి చేరుకుంటున్నారని, పలు వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని చెప్పారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో సోమవారం బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ గెలుపునకు కలిసి వచ్చే అంశాలను ఉదాహరణలతో వివరించారు. కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా మళ్లీ పొరపాట్లు జరుగకుండా బీఆర్ఎస్ శ్రేణులు చూసుకోవాలి. ఇవాళ ఏ ఊరికి పోయినా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 3న దిగిపోయిన విషయం మీకు తెలుసు. కేఆర్ఎంబీ విషయంలో నల్లగొండలో జరిగిన బహిరంగ సభ తర్వాత ఆదివారం మన అధినేత కేసీఆర్ సూర్యాపేట, తుంగతుర్తికి వచ్చారు.
Brs Constituency Meeting
ఈ రెండుచోట్లా హాజరైన జనంలో ఎమోషన్ చూస్తుంటే నల్లగొండ జిల్లాలో మనం ఎట్లా ఓడిపోయామో అర్థం కాలేదు. జరిగింది కలా నిజమా అనిపించింది. మనం మోసపోయామని ప్రజలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎక్కడ సభలు పెట్టినా, రోడ్ షోలు నిర్వహించినా 40 వేల నుంచి 50వేల మందికిపైగా జనం వచ్చారు. ఉమ్మడి నల్లగొండలో 12 సీట్లలో 7 నుంచి 8 గెలుస్తామనే విశ్వాసంతో ఉంటిమి. డిసెంబర్ 3న ఫలితాల్లో అందుకు భిన్నంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అనేక మాయమాటలతో ప్రజలను నమ్మించింది. వంద రోజుల పాలన తర్వాత కాంగ్రెస్ ఏ చేసిందో, ఎట్లా జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నదో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది.
కాంగ్రెస్ సర్కారు వస్తే డిసెంబర్ 9న రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. రైతులు ఉరుకుల పరుగుల మీద పోయి లోన్ తీసుకున్నరు. కాంగ్రెస్ ఇచ్చిన హామీకి మరో వారం రోజులైతే ఐదు నెలలు పూర్తవుతుంది. ఇంతవరకు రుణమాఫీపై ఎటువంటి ప్రకటన చేయలేదు. రుణాలు తీసుకున్న రైతుల ఆస్తులను జప్తు చేస్తామని బ్యాంకులు నోటీసులు పంపిస్తున్నాయి. కానీ రేవంత్ సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తున్నది. రైతు రుణమాఫీ పొందిన వారంతా కాంగ్రెస్‌కు ఓటేయండి, మోసపోయిన వాళ్లు బీఆర్ఎస్కు ఓటేయండి అని రైతులకు పార్టీ శ్రేణులు చెప్పాలి. రైతుబంధు ఇంకా చాలా మంది రైతులకు రాలేదు. కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు కుత కుత ఉడుకుతున్నరు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టండి అని మంత్రి కోమటిరెడ్డి అంటడు.
రైతు బంధు దుబార అని, కేసీఆర్ డబ్బులన్నీ వేస్ట్ చేసిండని మరో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడక ముందే ఇంత అహకారంగా మాట్లాడుతున్నరు. రేపు ఓటు వేస్తే ఏమంటారో. రైతుబంధు, రుణమాఫీ, నీళ్లు, కరెంట్ ఇవ్వకున్నా.. నాగార్జునసాగర్‌ను కేఆర్ఎంబీకి ఇచ్చినా రైతులు మాకే ఓట్లేశారని అంటారు. అందుకే ఈ విషయాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఎంతో ఉన్నది. కాంగ్రెస్ నాయకులు గత ఎన్నికలకు ముందు ఇస్తానన్నట్లుగా రైతులకు 2లక్షల రుణమాఫీ చేయాలి. 18 ఏండ్లు నిండిన ఆడ బిడ్డలకు కోటి 67లక్షల మందికి రూ.2,500 ఇవ్వాలి. రైతు భరోసా కింద పెంచి ఇస్తామన్న డబ్బులు, లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా, రైతు కూలీలకు వెయ్యి రూపాయలు, ఆటో డ్రైవర్లకు నెలకు వెయ్యి ఇవ్వాలి.
ఇవన్నీ చేసేదాకా రేవంత్ సర్కారును నిలదీయాలని, ప్రజలకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్, నలమోతు భాస్కర్ రావు, నోముల భగత్, బొల్లం మల్లయ్య యాదవ్, నాయకులు రాంచందర్ నాయక్, ఎనుగుల రాకేశ్‌రెడ్డి, తిప్పన విజయ సింహారెడ్డి, చకిలం అనిల్ కుమార్, చీర పంకజ్ యాదవ్, ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, నిరంజన్ వలీ, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, నిమ్మల శ్రీనివాస్, మందడి సైదిరెడ్డి, పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్ గౌడ్, నల్లమోతు సిద్ధార్థ పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న హామీలపై జనంలో చర్చపెట్టి ఏ స్థాయిలో మోసం చేసిందో పార్టీ శ్రేణులు వివరించాలి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో కొంత కష్టపడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు సునాయసంగా కైవసం చేసుకోవచ్చు. గతంలో కాంగ్రెస్ సర్కారు దౌర్భాగ్య స్థితి మనకు తెలుసు. ఈ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను పోషిస్తే ఆ భూతాన్ని పారదోలింది కేసీఆర్ అని చెప్పుకోలేక పోయినం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ల ఆకారాలు పెరిగినాయ్ తప్ప ఒక్క మెడికల్ కళాశాల తేలేదు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మూడు మెడికల్ కళాశాలలు ఇచ్చారు కేసీఆర్, కానీ జనానికి చెప్పడంలో ఫెయిల్ అయినం. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించింది. చిన్నచిన్న కారణాలతో అసంతృప్తికి లోనైన వారిని సముదాయించుకోకపోవడంతో నష్టం జరిగింది. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైనా అమలు చేయాలంటే కొంత సమయం పడుతుంది. అందుకే మన అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల గడువు ఇచ్చారు. డిసెంబర్ 9న అమలు చేస్తామన్న హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద రోజుల సమయం ఇచ్చాం. ప్రజా పాలనను విస్మరిస్తే ఉపేక్షించేది లేదు. బీఆర్ఎస్ నుంచి కొందరు నాయకులు పోయినంత మాత్రాన మనకొచ్చే నష్టమేమీ లేదు. నాలాంటి నాయకులు తయారైంది ఈ పార్టీలోనే. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రెండు సీట్లను గెలిచే విధంగా కార్యకర్తలు కృషి చేయాలి. కేసీఆర్ వంద రోజులు కాకుండా మరో 10 రోజులు బోనస్‌గా ఇచ్చినా కాంగ్రెస్ సర్కారు చేసిందేమీ లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క ఉంటుంది. పొద్దున లేస్తే కేసీఆర్‌పై విమర్శలు చేయడమే కాంగ్రెస్ నేతలకు పరిపాటిగా మారింది.
ఇంకా కేసీఆరే ముఖ్యమంత్రిగా, మేము మంత్రులుగా ఉన్నామనే భ్రమలో వారు మాట్లాడుతున్నారు. ఇంకా ప్రజల గురించి ఆలోచన లేకుండా కేసులు పెడుతామని కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది. ఈ దొంగలు, లఫంగులు తెచ్చిన కరువు ఇది. కేసీఆర్ చెప్పిన ప్రతి మాట బీఆర్ఎస్ సైనికులు ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. కేసీఆర్‌ను పోగొట్టుకొని ఇవ్వాళ ఎంత నష్టం జరిగిందో ప్రజలకు అర్థమైంది. ఇవ్వాళ కేసీఆర్ ఉంటే నాగార్జునసాగర్, ఎస్ఎల్బీసీ కింద ఒక్క ఎకరం కూడా ఎండి పోయేది కాదు. అయిదానికి కాని దానికి ఉరికే మంత్రి వెంకట్‌రెడ్డి పంటలు ఎండిపోతుంటే పత్తా లేడు.
-మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నాడు తెలంగాణ నుంచి ఆంధ్రా ఇతర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు ఉంటే నేడు ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికే వలస వస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయదారుడు కావడం వల్ల రైతులకు కావాల్సివన్నీ సమకూర్చారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఆలోచించాలి. ఒక్క అవకాశం ఇవ్వండి పెద్ద బిడ్డగా వచ్చి సేవ చేసుకుంటా. గతంలో న్యాయవాదిగా పని చేశాను. తెలంగాణకు కేసీఆర్ అవసరం ఇంకా ఉంది. రాష్ట్రంలో పొలాలకు నీళ్లు లేవు. కరెంట్ లేదు. రుణమాఫీ ఇస్తామని ఇవ్వలేదు. వలస పోయే పరిస్థితి మళ్లీ వచ్చింది. కాంగ్రెస్‌కు ఒక్క ఓటు వేస్తే సగం భూములు ఎండి పోయినయ్.
-కంచర్ల కృష్ణారెడ్డి, నల్లగొండ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి
ఒక్క సారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వంద రోజుల్లో 200 మంది రైతులు
ఆత్మహత్య చేసుకున్నారు. బీఆర్ఎస్ మొదటి నుంచి రైతుల పక్షానే ఉంటుంది. రైతులకు అన్యాయం జరుగుతుండటంతో ప్రతిపక్ష పార్టీగా మాజీ సీఎం కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. రైతు బంధు, రుణమాఫీపై మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు పట్టకుండా సీఎం రోజూ ఢిల్లీ బాట పడుతున్నాడు. మంత్రులు ఎవరేం చేస్తారో తెల్వని పరిస్థితి నెలకొన్నది.
నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడై కదలాలి. ప్రజలతో మమేకమై ముందుకు సాగాలి. భేదాభిప్రాయాలు ఉంటే ఈ ఎన్నికల వరకు పక్కన పెట్టాలి. కాంగ్రెస్ సర్కారు వంద రోజుల పాలనలో విఫలమైన పనులను ప్రజలకు వివరించాలి. బీఆర్ఎస్పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతల కుట్రలను తిప్పికొట్టాలి.