హాలియా, మే 01 : కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, మేడే స్ఫూర్తితో కార్మికుల ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. ’మే’ డే సందర్భంగా హాలియా పట్టణంలో బీఆర్ఎస్ కార్మిక (BRTU) జెండాలను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మిక, కర్షక లోకానికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కోసం కేసీఆర్ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు జీతభత్యాలు పెంపు, ఆరోగ్య బీమాతో ఇతర సంక్షేమ పథకాలతో వారికి భరోసా కల్పించినట్లు చెప్పారు. ఆటో డ్రైవర్లకు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక సాయంతో పాటు సంక్షేమ బోర్డులతో అండగా నిలచామన్నారు. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు, మహిళా కార్మికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఈ సంరద్భంగా గుర్తు చేశారు.
కార్మికుల హక్కుల కోసం బీఆర్ఎస్ తరఫున నిరంతరం పోరాడుతామని, మేడే స్ఫూర్తితో కార్మికుల ఐక్యత, సమానత్వం కోసం కలిసి నడుద్దామని సూచించారు. శ్రమ జీవులతోనే అభివృద్ధి, మానవ జాతి పురోగతి సాధ్యమైందన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యమన్నారు. రాష్ట్రంలోని కార్మికులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మాజీ కౌన్సిలర్లు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.

కార్మిక హక్కుల కోసం బీఆర్ఎస్ నిరంతర పోరాటం : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్