యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌పై రైతులు ఎంత కోపంగా, వ్యతిరేకతతో ఉన్నారో నార్ముల్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఆదివారం ఆయన యాదగిరిగుట్టలో విలేకరులతో మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ క్యాంపులు నిర్వహించినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా రైతులు బీఆర్ఎస్కే పట్టం కట్టారని గుర్తు చేశారు.
అతి తకువ సమయంలో డెయిరీని నాశనం పట్టించారని విమర్శించారు. ఏడాది కాలంలో రూ.11 కోట్ల నష్టాలకు కారణమయ్యారని ఆరోపించారు. మదర్ డెయిరీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడు పాల బిల్లులు పెండింగ్ పెట్టిన ఘనత ప్రస్తుత పాలకవర్గానిదే అని మండిపడ్డారు. హాస్టళ్లు, ఆలయాలకు పాలు, నెయ్యి నిలిపివేసి డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నార్ముల్ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి చేతకానితనంతో డెయిరీ ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలతో అందరూ విసిగిపోయారని మండిపడ్డారు.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడూ యూరియా కొరత లేదని, కాంగ్రెస్ అసమర్థ పాలనతో రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అందుకే మదర్ డెయిరీ ఎన్నికల్లో రైతులు హస్తం పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మదర్ డెయిరీ ఫలితాలే పునరావృతం అవుతాయన్నారు. సమావేశంలో బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.