యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరు ఏమీ బాగాలేదు.. ఇది జనం మాట. ఏడాదిన్నర కాలంలో అధిక శాతం మంది శాసనసభ్యుల పెర్ఫార్మెన్స్ చాలా పూర్‌గా ఉంది. ఎమ్మెల్యేలు పాలన, పనితనంలో వెనకంజలో ఉన్నారు. టాప్-20 ఇద్దరు మాత్రమే చోటు దక్కించుకున్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏకంగా 101వ ర్యాంకులో ఉన్నారు. పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థలు విడుదల చేసిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవిప్పుడు సోషల్ మీడియాలోవ వైరల్ అవుతున్నాయి.
పీపుల్స్ పల్స్ – సౌత్ ఫస్ట్ అనే సంస్థలు సంయుక్తంగా మార్చి 28 నుంచి ఈ నెల 3 వరకు 118 (సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం మినహాయించి)నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 450 నుంచి 500 నమూనాలను కంప్యూటరైజ్డ్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్యూస్ ద్వారా సేకరించాయి. ఇందులో పురుషులు, మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 11 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే.
అధికార ఎమ్మెల్యేతో పోలిస్తే మాజీ మంత్రి, ప్రతిపక్ష బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మెరుగైన స్థానంలో నిలిచారు. ఉమ్మడి నల్లగొండలో మంత్రులు, ప్రభుత్వ విప్ తర్వాత తన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనకు 37వ స్థానం దక్కింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. హుజూర్నగర్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి 9వ స్థానంలో నిలిచారు. 44.3శాతం మంది ఈయన పనితీరు బాగుందని, 38.0శాతం బాగాలేదని వెల్లడించారు. 11.2శాతం మంది ఫర్వాలేదని, 6.6శాతం మంది ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. నల్లగొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 17ర్యాంకు వద్ద ఉన్నారు. 41.8శాతం మంది ఈయన పని తీరు బాగుందని, 39.2శాతం బాగాలేదని తెలిపారు. 11.3 శాతం మంది ఫర్వాలేదని, 7.7శాతం మంది ఏమీ చెప్పమలేని స్పష్టం చేశారు.
సర్వే ఫలితాల ప్రకారం ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్యేల పని తీరును పరిశీలిస్తే.. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి పెర్ఫార్మెన్స్ చాలా పూర్‌గా ఉంది. ఆయన ఏకంగా 101 ర్యాంకు వద్ద ఉన్నారు. ఎమ్మెల్యే పని తీరు 36.9 శాతం మంది బాగుందని, 49.3 శాతం మంది బాగా లేదని, 7.5 శాతం మంది ఫర్వాలేదని చెప్పారు. 6.3శాతం మంది ఏదీ చెప్పలేదు.