నకిరేకల్, మే 13 : కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, కార్మిక హక్కుల కోసం తమ పార్టీ ముందుండి పోరాడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ నకిరేకల్ పట్టణంలోని శకుంతల ఫంక్షన్ హాల్లో మంగళవారం పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, ఎన్హెచ్ఎం ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలన్నారు.
బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కార్మిక వ్యతిరేక విధానాలను వేగవంతంగా అమలు చేస్తున్నదని, 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల అమలుకు చర్యలు వేగవంతం చేయడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. ఈ నెల 20న నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిల్వేరు ప్రభాకర్, సీఐటీయూ జిల్లా నాయకుడు వంటెపాక వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు అంబటి చిరంజీవి, బీఆర్టీయూ ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు రేణుక, నాయకులు ఉయ్యాల సైదులు, సిలువేరు శోభారాణి, గొర్ల సోమన్న, ఆదిమల్ల సుధీర్, ఇందూరు సాగర్ పాల్గొన్నారు.