కోదాడ, జూన్ 14 : దేశంలోని అన్ని వర్గాల హక్కుల పరిరక్షణకు డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంటగల్పుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆదివారం కోదాడ ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక ఓటరు బాధ్యత, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ పేరుతో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్షాల ఓట్లు తొలగించే కుట్రకు తెర లేపాయని విమర్శించారు.
దేశంలోని ఐదు రాష్ర్టాల్లో సర్ ప్రక్రియ జరిపితే పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడుల్లో లక్షల ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న అస్సాంలో మాత్రం సర్ నిర్వహించలేదన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కలిసే ఉన్నాయని, అందుకే కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు నమోదైనే నిందితుడిని సీఎం కాపాడారని విమర్శించారు. 2028లో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మకై బీఆర్ఎస్ ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తున్నాయన్నారు.
బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 2028లో ఎలాగైనా అధికారంలోకి వస్తామని, ఓట్లు తొలగించి అధికారంలోకి వస్తామని పరోక్షంగా స్పష్టం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులను బీఎల్వోలుగా నియమించి, వారి చేత బీఆర్ఎస్ ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని, అందుకే బీఆర్ఎస్కు చెందిన బీఎల్వోలు అనుక్షణంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.