చిట్యాల, ఏప్రిల్ 16 : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. బుధవారం చిట్యాలలోని లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ తన ప్రాణాలను ఎదురొడ్డి, పోరాటాలు చేసి సాధించిన తెలంగాణను 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి అభివృద్ధి పథంలో నడిపించాడని, కానీ కాంగ్రెస్ 16 నెలల పాలనలో అన్ని రంగాల్లో అదోగతి పాలుజేసిందన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సంక్షేమ పథకాల అమల్లో విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ బెదిరింపులు, అక్రమ కేసులకు కార్యకర్తలు భయపడవద్దని, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమేనని ధైర్యంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ అంటేనే పోరాటం అని తమకు పోరాటం కొత్తేమీ కాదన్నారు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ చేసినా వారిని పోలీస్ స్టేషన్ పిలిపిస్తున్నట్లు చెప్పారు. రైతులు, చేనేత కార్మికులు, రిక్షా కార్మికుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం తన సొంత లాభం కోసం ప్రభుత్వ భూముల అమ్మకానికి సిద్ధమవుతుందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వంపై ఎంతగా విసిగెత్తారనేది కాంగ్రెస్ సర్వేల ద్వారానే తేలిపోయిందని, వారి సర్వేలలో కూడా ప్రజలు బీఆర్ఎస్ కే ఓటు వేసినట్లు తెలిపారు.
ప్రజల కోసమే నిరంతరం పోరాడిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతీ గ్రామం నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మండలాధ్యక్షుడు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి, నాయకులు కొలను వెంకటేశం, సుంకరి యాదగిరి, రాచకొండ కిష్టయ్య, దేవరపల్లి సత్తిరెడ్డి, మేండే సైదులు, కొలను సతీశ్, ఆగు అశోక్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.