బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం జరిగే సభకు లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాతో బ్రహ్మాండంగా కనీవిని ఎరుగని రీతిలో సభకు ఏర్పాట్లు పూర్తికావస్తుండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కనీసం లక్ష మందికిపైగా తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలంతా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి వరకు పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలను సమాయత్తం చేశారు. దాంతో వేలాది మంది తరలి వచ్చేందుకు సిద్ధమవుతుండగా ఇప్పటికే అందుకు అవసరమైన రవాణా, ఇతర ఏర్పాట్లను దాదాపు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం నుంచే సభకు తరలివెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటూ రజతోత్సవ బహిరంగ సభ వేదికగా పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ఆలకించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి తరలివెళ్లే వాహనాల కోసం సభా నిర్వాహకులు పార్కింగ్ జోన్-2లో స్థలాన్ని కేటాయించారు. ఇక్కడి నుంచే వాహనాలన్నీ అక్కడే పార్క్ చేసుకుని సభాస్థలికి బీఆర్ఎస్ శ్రేణులు,ప్రజలు చేరుకోవాల్సి ఉంటుంది.
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణానికి రాష్ట్రం నలువైపుల నుంచి సులువుగా చేరుకునేందుకు జోన్లవారీగా రూట్ మ్యాప్‌లను సభా నిర్వహకులు విడుదల చేశారు. సభకు తరలివచ్చే లక్షలాది మంది జనం, వేలాది వాహనాలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఐదు జోన్లను సిద్ధం చేశారు. అందులో పార్కింగ్ జోన్-2ను ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వచ్చే వాహనాల కోసం కేటాయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, పాలేరు, సత్తుపల్లి, మధిర, పినపాక, వైరా, ఇల్లెందులో కొన్ని మండలాల వాహనాలను పార్కింగ్ జోన్-2 కోసం అనంతసాగర్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో ఆపాల్సి ఉంటుంది.
ఇక ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాలతోపాటు నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల, రామన్నపేట మండలాలకు చెందిన వాహనాలు వరంగల్-హైదరాబాద్ హైవే మీదుగా భువనగిరి, ఆలేరు, జనగాం, స్టేషన్‌ఘన్‌పూర్ మీదుగా కరుణాపురం దాటాక వరంగల్ బైపాస్ మీదుగా దేవన్నపేట టోల్గేట్ దాటి మడిపల్లి నుంచి అనంతసాగర్ పార్కింగ్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన వాహనాలు నకిరేకల్ మీదుగా అర్వపల్లి, తిరుమలగిరి, మొండ్రాయి, పాలకుర్తి మీదుగా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చేరుకుని అక్కడి నుంచి కరుణాపురం దాటాక వరంగల్ బైపాస్ మీదుగా దేవన్నపేట టోల్‌గేట్‌కు చేరుకుని మడిపల్లి మీదుగా అనంతసాగర్ పార్కింగ్ స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల నుంచి వెళ్లేవారు సూర్యాపేట, అర్వపల్లి, తిరములగిరి, మొండ్రాయి, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ చేరుకుని అక్కడి నుంచి కరుణాపురం దాటాక బైపాస్ రోడ్డు మీదుగా దేవన్నపేట టోల్‌గేట్‌కు చేరకుని మడిపల్లి మీదుగా అనంతసాగర్ పార్కింగ్ స్థలానికి చేరుకోవాలి.
ఈ రూట్లోని వాహనాలు అర్వపల్లి, తిరుమలగిరి మీదుగా జనగాం, స్టేషన్ఘనపూర్ రూట్లోనే వరంగల్-హైదరాబాద్ హైవే మీదుగా కూడా అందరికీ కామన్ పాయింట్‌గా ఉన్న కరుణాపురం దాటాక బైపాస్ రోడ్డు మీదుగా చేరుకోవచ్చు. వరంగల్-హైదరాబాద్ హైవే హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ వాహనాలతో రద్దీ కానున్న నేపథ్యంలో మెండ్రాయి, పాలకుర్తి మీదుగా స్టేషన్ ఘన్పూర్ వద్ద హైవే ఎక్కి కరుణాపురం దాటాక వరంగల్ బైపాస్ మీదుగా సభాస్థలికి చేరుకుంటే ఇబ్బంది ఉండదనేది అంచనా. ఇలా ఉమ్మడి నల్లగొండ జిల్లా మీదుగా సభకు తరలివెళ్లే వాహనాదారులకు సభా నిర్వాహకులు ముందుస్తుగానే స్పష్టమైన సూచనలు చేశారు. అందుకు అనుగుణంగా సభకు తరలివెళ్లే వాళ్లు ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా సభాస్థలికి చేరుకోవడంతోపాటు తిరిగి సొంత ఊర్లకు రావడం సులువు కానుంది.