మఠంపల్లి, నవంబర్ 27: పంచాయతీ ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని పార్టీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మఠంపల్లి మండల బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, సీనియర్ నాయకులు మన్నెం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కకు పెట్టి, గ్రామాభివృద్ధికి పాటు పడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వీటిని ప్రజలకు వివరించాలని సూచించారు.
దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలి..
ఈనెల 29న జిల్లా కేంద్రంలో జరిగే దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చచ్చుడో -తెలంగాణ వచ్చుడో నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టారని అదే తెలంగాణ ఏర్పాటుకు కీలక మలుపు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త శక్తివంచన లేకుండా పని చేసి పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా గెలిపించాలన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాలకు పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు.
మట్టపల్లి- దాసరి విజయలక్ష్మీ వెంకటరమణ, సుల్తాన్పూర్ తండా- హరిచంద్రానాయక్, పెదవీడు -మాతంగి వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం- షేక్ హసీనా ఇస్మాయిల్, బాడువాతండా-చిరంజీవి నాయక్ అభ్యర్థిత్వాలను ఖరా రు చేశారు. మిగతా గ్రామాల అభ్యర్థులను మం డల, గ్రామాల నాయకుల సమక్షంలో ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డా. కేఎల్ఎన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ జగన్ నాయక్, బాలాజీ నాయక్, కంటు లక్ష్మయ్య,ఎల్లావుల నాగయ్య, కోలాహలం లక్ష్మీనరసింహరాజు, కృష్ణంరాజు, అయ్యప్ప, పిండిప్రోలు రామచంద్రయ్య, భద్రంరాజు రామారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.