నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారత రాష్ట్ర సమితి ప్రతినిధుల సభలు సంబురంగా సాగాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ప్రకారం సాగిన సభలు ఎంతో ఆకట్టుకున్నాయి. ముందుగా గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులంతా గులాబీ చొక్కాలు, కండువాలు ధరించి జై కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ జెండా పండుగలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రతినిధుల సభలకు తరలివచ్చారు. ఎమ్మెల్యేల సారథ్యంలో జరిగిన సభల్లో అన్నిచోట్లా పెద్దసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యవేక్షణలో అన్నిచోట్లా ప్రతినిధుల సభల్లో బీఆర్ఎస్ మార్క్ స్పష్టంగా కనిపించింది. సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కానటువంటి రీతిలో సభలను అత్యంత స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.
నాటి ఉద్యమ గుర్తులను నెమరువేసుకుంటూనే స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని సమీక్షిస్తూ.. భవిష్యత్తు కర్తవ్యాలపై దిశానిర్దేశం చేసేలా సభలు సాగాయి. ముఖ్య నేతల ప్రసంగాలు క్యాడర్లో సమరోత్సాహాన్ని నింపగా తీర్మానాలు అన్ని విషయాలను కూలంకషంగా చర్చించేందుకు దోహదపడ్డాయి. నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిపై నాడు-నేడు అనే పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మిర్యాలగూడ, దేవరకొండలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సూర్యాపేటలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పాల్గొన్నారు. నల్లగొండ, దేవరకొండలో ఎమ్మెల్సీ కడియ శ్రీహరి.. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు.
బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలు సంబురంగా సాగాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం అమరువీరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా నియోజకవర్గ ప్లీనరీకి బయల్దేరారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు, కండువాలతో ప్లీనరీ వేదిక, పరిసరాలు గులాబీమయమయ్యాయి. పార్టీ శ్రేణులు సైతం గులాబీ అంగీలతో హాజరయ్యారు. ప్లీనరీలో పలు తీర్మానాలు చేశారు. నేతలు ఆయా అంశాలను కూలంకషంగా వివరించారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎండగట్టారు. ఒక్కో సభలో రాజకీయ, స్థానిక అంశాలపై 10 నుంచి 20వరకు తీర్మానాలు ప్రవేశపెట్టగా.. మండలాల వారీగా నేతలు ఇందులో భాగస్వాములయ్యారు. క్షేత్రస్థాయిలో గతానికి, ఇప్పటికి ఉన్న తేడాలను అంశాల వారీగా తీర్మానాల్లో పొందుపరుస్తూ స్థానిక నేతలు మాట్లాడడంతో సభల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. కేంద్రంలోని మోదీ సర్కార్ వైఫల్యాలు, దేశ ప్రజల ఇబ్బందులు.. వీటన్నింటి నేపథ్యంలో దేశంలో బీఆర్ఎస్ ఆవశ్యకతను ముఖ్య నేతలు వివరించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేసేలా ప్రతినిధుల సభలు విజయవంతమయ్యాయి. ఇదే ఉత్సాహంతో రాజధానిలో రేపు నిర్వహించే రాష్ట్ర ప్లీనరీలో పాల్గొనేందుకు ఎంపిక చేసిన ప్రతినిధులంతా సిద్దమవుతున్నారు. గత నెలలో ఆత్మీయ సమ్మేళనాలు మొదలు రాష్ట్ర ప్లీనరీ వరకు ఎక్కడ చూసినా వరుస కార్యక్రమాలతో బీఆర్ఎస్ పార్టీలో సందడే సందడి కనిపిస్తున్నది. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజం వెల్లివిరుస్తున్నది.
కేడర్‌లో ఫుల్ జోష్
బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిపే తరహాలోనే నియోజకవర్గాల్లో ప్లీనరీ నిర్వహించడంతో పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. నాయకులు, కేడర్‌లో సమరోత్సాహం నింపింది. ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామనే తీరుగా గులాబీ దళం ఉత్సాహంగా కనిపించింది. ప్లీనరీలో జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. ఎండను సైతం లెక్కచేయకుండా ప్లీనరీ ముగిసే వరకు ప్రాంగణంలోనే ఉండిపోయారు. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ పాలనలో ప్రగతి విప్లవం
రాష్ట్రంలో ప్రగతి విప్లవం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికి మార్గదర్శంగా నిలిచింది. 2014కు ముందు రాష్ట్రంలో 60 లక్షల ఎకరాలు సాగు చేస్తే నేడు 1.35 కోట్ల ఎకరాలు సేద్యంలోకి వచ్చాయి. ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే. అభివృద్ధి, సంక్షేమ పథకాలు జోడెడ్ల మాదిరి పరుగులు పెడుతున్నాయి. పల్లెలు, పట్టణాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ సమకూర్చుతుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. బీఆర్ఎస్కు దేశ వ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక అడుగడుగునా అభివృద్ధికి అడ్డు తగులుతున్నది.
– సూర్యాపేట బీఆర్ఎస్ ప్లీనరీలో మంత్రి జగదీశ్‌రెడ్డి
దేశ ప్రజల శ్రేయస్సు కోసమే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు
దేశ ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పేదలపై ధరల భారం మోపుతున్నది. తెలంగాణ ఏర్పాటు నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్ర అభివృద్ధిపై ధ్యాస లేదు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు.