నార్కట్పల్లి నవంబర్ 26: ఎన్నికల సమయం వచ్చినప్పుడే పథకాలు అమలు చేయడం, అనంతరం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం కాంగ్రెస్ సర్కార్ నైజమని జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. బుధవారం పట్టణంలో చిట్యాల, నార్కట్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలతో హడావిడి చేస్తోందని ఆరోపించారు.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా జనం స్పష్టమైన వైఖరితో ఉన్నారని అన్నారు. ప్రజలకు బాకీ పడిన హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వ ఓటమి ఖాయమన్నారు. బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్ కూడా ఇవ్వడంలేదని అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గులాబీ జెండానే పేద వర్గాలకు శ్రీరామ రక్ష అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన మోసాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను, గడప గడపకు వెళ్లి వివరించాల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు. కేసీఆర్ ప్రతీ బతుకమ్మ పండుగకు కోటి 30 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు అందించిన సంగతిని వారు గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మహిళా స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 46 లక్షల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేసి గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న రూ. 2500 సంగతి ఏమైందని స్థానిక ఎన్నికల్లో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 29 తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజని అన్నారు. కార్యక్రమంలో రైతుబంధు మండల మాజీ కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, చిట్యాల, నార్కట్పల్లి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.