దేవరకొండ, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరకొండ పట్టణంలోని 16వ వార్డులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పుట్టడం వల్లే ఇవాళ దశాబ్దాల తెలంగాణ కల సాకారమైందన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో, స్వయం పాలనలో ఎంతో సంతోషంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు, అసలు బీఆర్ఎస్ పార్టీ అనేది లేకపోతే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నా, 33 జిల్లాలుగా పరిపాలన సాగుతుందన్నా అదంతా కేసీఆర్ కృషే అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భంగా ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మ బలిదానాలు చేసుకున్న ఉద్యమకారులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది 25 ఏండ్లు పూర్తి అయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసి పదవీ బాధ్యతలను చేపట్టిన ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రజారంజక పాలన అందించారన్నారు. అనేక ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేశారని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనతో ప్రజలు విసుగు చెందారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోసమే ఎదురు చూస్తున్నారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొంది బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్, నీల రవికుమార్, స్థానిక కౌన్సిలర్ కేతావత్ రుప్లా నాయక్, వేముల రాజు, పొట్ట మధు, ముత్యాల రవి, గాజుల రాజేష్, జనీబాబ, ఇలియాస్ పటేల్, మకాం చంద్రమౌళి, బురాన్, జమీర్ బాబా, మడెం రాములు, శ్రీధర్, కేతావత్ నాగు, నాగార్జున, గుండాల వెంకట్, వెంకటయ్య పాల్గొన్నారు.