నల్లగొండ, మే 19 : ప్రభుత్వ పెద్దలకు తొత్తులుగా మారి వారిని ప్రశంసించే వాళ్లను కాకుండా ప్రశ్నించే తన లాంటి వారికి అవకాశమివ్వాలని నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థ్ది ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో గ్రాడ్యుయేట్ల గొంతుకగా ప్రశ్నిస్తానని తెలిపారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల, అవుట్ డోర్, ఇండోర్ స్టేడియంలో ఆదివారం వాకర్స్‌ను కలిసి తనను గెలిపించాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలేదని, దీనిపై కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1.68 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు 3.5 లక్షల నుంచి 9లక్షల ఐటీ ఉద్యోగాలకు పెంచినట్లు తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్లు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తాను బిట్స్ పిలానీలో చదివి అమెరికాలో ఉండి వచ్చానని, సంపాదించిన సొమ్ము పేద విద్యార్థుల చదువు కోసం వినియోగిస్తున్నానని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వచ్చే గౌరవ వేతనంతో నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించడంతోపాటు వచ్చిన నిధులు సైతం లైబ్రరీల నిర్మాణం కోసం వినియోగిస్తానన్నారు.
తాను కేసీఆర్ మాట, విజన్ కోసం ఎమ్మెల్సీగా బరిలో నిలిచానని, ఆయన సూచనకు అనుగుణంగా ముందుకు సాగుతానని తెలిపారు. తాను రైతు బిడ్డనని, రైతులకు రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టమని అన్నవాళ్లకు ఆ రైతులు, రైతు బిడ్డలు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలన్నారు. రైతుల ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టిన కాంగ్రెస్ వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జీఓ 46 ద్వారా కొంత మందికి అన్యాయం జరిగినట్లు గుర్తించిన గత ప్రభుత్వం.. ఆ జీఓను సరి చేసే ముందే ఎన్నికల కోడ్ వచ్చినందున వీలు పడలేదన్నారు. ఆ జీఓను రద్దు చేస్తామని చెప్పిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. జర్నలిజాన్ని ఎర్నలిజంగా మార్చి రంగులు మార్చే ఊసరవెల్లులు ఎన్నికల్లోకి వస్తున్నాయని, వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.
గతంలో ఎంతో మంది మేధావులకు పట్టం కట్టిన విద్యావంతులు ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక ఎవరో.. ప్రశంసిస్తూ మోసం చేసే వారు ఎవరో గుర్తించి ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే గ్రా డ్యుయేట్ల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదని ఆరోపించారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. గ్రాడ్యుయేట్లు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గమనించి బీఆర్ఎస్ అభ్యర్థ్ది రాకేశ్‌రెడ్డికి అవకాశమిస్తే మండలిలో వారి సమస్యలపై గొంతెత్తుడన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున, కట్టా శ్రీను తదితరులు పాల్గొన్నారు.