వేములపల్లి, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీ నాయకుల మోసపు మాటలు నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో కారు చీకట్లు తప్పవని బీఆర్ఎస్ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువారం మండలంలోని అన్నపరెడ్డిగూడెం, వేములపల్లి, తిమ్మారెడ్డిగూడెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం కలికారు. మహిళలు బొట్టుపెట్టి ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు స్వచ్ఛందంగా ప్రచారంలో ఎమ్మెల్యే వెంట నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ పదేండ్లలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పారీ ప్రజలను గాలికి వదిలేసిందే తప్ప వారి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ కుర్చీల కొట్లాటే తప్ప ప్రజల గురించి పట్టించుకున్న నాథుడు లేడన్నారు. 11సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ర్టానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఆ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్నారన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా వారి వివాహానికి ఆర్థిక సాయం అందించారన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు.
వేములపల్లి మండలంలో 2014 నుంచి 2023 వరకు రూ.258.21కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. దాంతో పాటు సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.286.70కోట్లు వెచ్చించింది తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగేందుకు మరో మారు బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. తనను మరో మారు ఆశీర్వదిస్తే మిగిలిన అభివృద్ధిని అనతికాలంలోనే పూర్తి చేస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రాగానే అమలు చేస్తారన్నారు. అసైన్డ్ భూములపై ఉన్న ఆంక్షలను రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎత్తివేయనుందని చెప్పారు. అగ్రవర్ణాల పేదల పిల్లల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రేషన్‌కార్డు దారులకు పూర్తి స్థాయిలో సన్నబియ్యాన్ని అందిస్తామన్నారు. గతంలో ఇచ్చిన ప్రతి హామీని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని, ప్రస్తుతం మ్యానిఫెస్టోలో ఉన్న వాటిని సైతం వందశాతం అమలు చేస్తుందన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తనను మరో మారు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, రైతుసంఘం జిల్లా నాయకులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, సర్పంచులు చిర్ర మల్లయ్యయాదవ్, మజ్జిగపు పద్మ, అనిరెడ్డి నాగలక్ష్మి, దేశిరెడ్డి లక్ష్మి, దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, బత్తుల ధనమ్మ, నాయకులు కృపాకర్‌రావు, ఇరుగు వెంకటయ్య, నాగవెల్లి శంకర్, జావెద్, పుట్టల పౌల్, మజ్జిగపు శ్యామ్, సతీశ్‌రెడ్డి, ఉగ్గె మునీశ్వర్ పాల్గొన్నారు.