సూర్యాపేట, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం, ఇదేంటని నిరసన వ్యక్తం చేసే వాళ్లను అడ్డుకోవడం సిగ్గుచేటని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, పరిపాలన చేతకాక రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తున్నారని తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కృష్ణ, గోదావరిలో నీళ్లు ఉన్నా రైతులకు సాగు నీరు ఇవ్వలేని దుస్థితిలో ఉందని మండిపడ్డారు.
ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వ అడ్డుకుంటుందని, ప్రజల ఓపిక నశిస్తే వారి ఆగ్రహం చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రధానంగా కేటీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి ఎందుకు వణుకు పుడుతుందో అందరికీ అర్థం అవుతుందన్నారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్లినా శాంతియుతంగానే ప్రజలు కూడా కనీవిని ఎరుగని రీతిన వచ్చి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. రైతులను మోసం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు చేస్తున్నదని, ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన పని చేయడం పార్టీల హక్కు అని చెప్పారు. నల్లగొండలో సభ అంటే పోలీసులు నిరాకరించారని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కాస్త ఆలస్యమైనా నల్లగొండలో సభ నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి తీరుతామని తెలిపారు.