హాలియా, ఏప్రిల్ 4 : కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేయడంతో మున్సిపల్ శాఖలో నిర్లక్ష్యం అలుముకున్నదని, ప్రజలకు తాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేదా? అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. నాగార్జున సాగర్ హిల్‌కాలనీలో కోతులు పడ్డ వాటర్ ట్యాంక్‌ను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్కుమార్తో కలిసి గురువారం పరిశీలించారు. కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 2014కు ముందు నాగార్జున సాగర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీ కాకుండా ఉండేదన్నారు. పక్కనే సాగర్ జలాశయం ఉన్నా ఇక్కడి ప్రజలకు తాగునీరు దొరికేది కాదని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడి ప్రజల సమస్యలను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నాగార్జున సాగర్‌ను నందికొండ మున్సిపాలిటీగా చేయడం జరిగిందన్నారు. పదేండ్లుగా నాగార్జున సాగర్‌లో ఏ సమస్యలూ లేవని, బీఆర్ఎస్ హయాంలో నాలుగేండ్ల పాటు నాగార్జున సాగర్‌తోపాటు రాష్ట్రమంతా ఇంటింటికీ తాగునీరు అందించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నందికొండ మున్సిపాలిటీలో మళ్లీ సమస్యలు నెలకొన్నాయని, మున్సిపల్ శాఖలో నిర్లక్ష్యం అలుముకుందని అన్నారు. ప్రజలకు తాగునీటిని అందించే వాటర్ ట్యాంకులను నిత్యం తనిఖీ చేసే సమయం కూడా అధికారులకు లేకుండా పోయిందని విమర్శించారు.
కోతులు పడిన ట్యాంకు నీళ్లు తాగిన ప్రజలు రోగాలబారిన పడే అవకాశం ఉన్నదన్నారు. ప్రభుత్వం వారికి ఆరోగ్య పరీక్షలు చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నదన్నారు. తెలంగాణలో దోచుకొని ఢిల్లీకి ముడుపులు పంపే పనిలో రేవంత్‌రెడ్డి సర్కార్ బిజీగా ఉన్నదని ఆరోపించారు. గ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారని, పంటలకు సాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రాగానే నీళ్లు కాల్వలలకు వదిలారని తెలిపారు. కరువు సమయంలో ప్రత్యేక ప్రణాళికతో తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా ప్రవీణ్, చెన్ను సుందర్‌రెడ్డి, అల్లి పెద్దిరాజు, రమేశ్‌జీ పాల్గొన్నారు.