అప్పటివరకు కుటుంబ పెద్దగా.. ఇంటికి ఆదెరువుగా ధైర్యమిచ్చిన వ్యక్తి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఓ వైపు మనిషి దూరమైన దుఃఖం… మరోవైపు అప్పటివరకు బాధ్యతలు మోసిన వ్యక్తి లేకపోవడంతో చుట్టుముట్టే ఆర్థి సమస్యలు. వాటితో మానసికంగా కుటుంబం మరింత కుంగుబాటుకు గురవడం ఖాయం. పెద్ద దిక్కును కోల్పోయిన లోటు ఎవ్వరూ పూడ్చలేనిదైతే.. ఆర్థికంగా భరోసానిస్తే ఆ కుటుంబం ఎంతో కొంత నిలదొక్కుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఎంతో మంది నిరుపేదలు, సామాన్యులు వివిధ కారణాలతో కుటుంబ పెద్దను కోల్పోయి వీధిన పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణం నుంచి పుట్టిందే కేసీఆర్ బీమా పథకం.
సమాజంలోని అట్టడుగువర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మరో గొప్ప పథకాన్ని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రైతు బీమా తరహాలో రాష్ట్రంలో తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఈ బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వమే ప్రీమియం కట్టనున్నది. ఎవరైనా కుటుంబ పెద్దను కోల్పోతే బాధిత ఫ్యామిలీకి రూ.5లక్షల నగదు అందనున్నది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 10.07 కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనున్నది.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్17(నమస్తే తెలంగాణ) : అది ప్రమాదమైనా, గుండెపోటైనా, ఇతర అనారోగ్య సమస్యలైనా, హఠాన్మరణమైనా… ఇలా కారణం ఏదైనా సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికీ బీమా సౌకర్యం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. అందులో భాగంగానే రాష్ట్రంలోని బీపీఎల్ పరిధిలోకి వచ్చే 93లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకాన్ని పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల బీమా సొమ్మును చెల్లించేలా పథకం ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇది కూడా అత్యంత విశ్వాసానికి మారుపేరైన ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ ద్వారానే అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
దీంతో ఎల్ఐసీపై ఉన్న నమ్మకంతో ఈ పథకం పకడ్బందీగా అమలుకానుందనడంలో సందేహం లేదు. ఇది దేశంలోనే అత్యంత మానవీయ పథకంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆపద సమయాల్లో కుటుంబానికి ఆర్థికంగా భరోసానిస్తూ అండగా నిలిచే పెద్దన్న పాత్రను సర్కార్ భుజాలకు ఎత్తుకుంటున్నందుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కేసీఆర్ బీమా పథకంతో ఉమ్మడి జల్లాలో ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మొత్తం 10.07లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగనున్నది. వీరంతా ప్రస్తుతం బీపీఎల్ పరిధిలో ఉంటూ తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉన్నారు. ఈ కార్డుదారుల్లోని కుటుంబ పెద్ద చనిపోతే ఈ పథకాన్ని వర్తింప చేయనున్నారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండలో 4.66లక్షల కుటుంబాలు, సూర్యాపేటలో 3.04లక్షల కుటుంబాలు, యాదాద్రిభువనగిరిలో 2.16లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకంలోకి రానున్నాయి.
ఈ పథకం ద్వారా ఆయా కుటుంబాల్లోని సుమారు 25లక్షల మంది సభ్యులకు అపత్కాలంలో కేసీఆర్ భీమా ఉంటుందన్న భరోసా దొరకనున్నది. వాస్తవంగా ఇప్పటివరకు ముఖ్యంగా నిరుపేద, పేద కుటుంబాలకు బీమాపై కనీస అవగాహన కూడా ఉండడం లేదు. కుటుంబ పెద్ద బాగుండి పనిచేస్తున్నప్పుడు రోజువారీ జీవితం అలా గడిచిపోతూనే ఉంటుంది. ఉన్నట్టుండి ఏదైనా ఆపద సంభవించి పెద్ద దిక్కును కోల్పోతే రోడ్డు పడుతున్న కుటుంబాలెన్నో ఉన్నాయి. కుటుంబ పరిస్థితులే తారుమారై.. దిక్కులేని వారిగా మారుతున్నారు. కుటుంబ భారాన్ని మోయలేక, పిల్లలకు భవిష్యత్తును చూపలేక ఇల్లాలుకు నరకయాతన తప్పడం లేదు. ఇటువంటి సమయంలో ఆర్థిక భరోసా లభిస్తే ఆ కుటుంబం కొన్నాళ్లు మానసికంగా కోలుకుని మళ్లీ దారిన పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆపద సమయాల్లో ఆదుకునేందుకే కేసీఆర్ అద్భుత పథకం ప్రకటించారన్నది వాస్తవం.
రైతుబంధు తరహాలోనే..
కేసీఆర్ బీమా పథకాన్ని కూడా రైతుబంధు తరహాలోనే అమలు చేయనున్నట్లు సూచనప్రాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక దీనిపై పూర్తి స్పష్టత రానుంది. విధివిధానాలు ఖరారు చేసి పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో 2018 నుంచి అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే దీన్ని కూడా ఎల్ఐసీ ద్వారానే అమలు చేయనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. రైతు బంధు పథకానికి ప్రతియేటా ఆగస్టులో ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు చేస్తున్నది. ఏటేటా ప్రీమియం చెల్లింపులతో ఒక్కపైసా రైతులపై భారం పడకుండా దీన్ని అమలు చేస్తున్నది.
రైతులు మరణిస్తే పక్షం రోజుల్లోనే పైరవీలకు తావు లేకుండా ఒక్క పైసా ఖర్చు లేకుండా నేరుగా ఐదు లక్షల బీమా సొమ్ము సంబంధిత కుటుంబం ఖాతాలో జమ అవుతున్నాయి. చనిపోయిన అనంతరం డెత్ సర్టిఫికెట్తో ఇతర ఆధారాలను సమర్పిస్తే నిర్ణీత గడువులోగానే బీమా సొమ్ము రైతులకు చెల్లిస్తున్నారు. రైతు బీమాను ఒక్క నల్లగొండ జిల్లాలో పరిశీలిస్తే.. 2018 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మొత్తం 6,256 మంది రైతులు చనిపోతే వారికి 312.80కోట్ల రూపాయలను బీమా సొమ్ముగా ఆయా కుటుంబాలకు చెల్లించారు. ఇదే తరహాలో వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ బీమా పథకం కూడా ఆపత్కాలంలో పేదల జీవితాల్లో భరోసానిస్తుందనడంలో సందేహం లేదు. దీంతో కేసీఆర్ బీమా- ప్రతి ఇంటా ధీమా పథకం ప్రకటనపై ప్రశంసల జల్లు కురుస్తున్నది.
పేద కుటుంబాలకు ఆసరా
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ బీమా పథకం పేద ప్రజలకు ఎంతో ధీమాను ఇస్తుంది. ఇప్పటివరకు రైతులకు, చేనేత కార్మికులకే పరిమితమైన ఈ పథకం బీపీఎల్ కుటుంబాలకు అమలు చేస్తానని చెప్పడం సంతోషదాయకం. పేదలు ఏకారణం చేతనైన చనిపోయినా 5లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకంతో పేద కుటుంబాలకు భరోసా కలుగుతుంది. పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– బద్దుల ఉమా, బోగారం, రామన్నపేట మండలం
నిరుపేదల జీవితాలకు భరోసా సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా పథకం ప్రవేశపెట్టడం అభినందనీయం. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి. నిరుపేద జీవితాలకు ఎల్లవేళ్లలా భరోసా ఇస్తున్నారు. కేసీఆర్ వల్లనే పేదలు నేడు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ప్రతి పేద కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించడం సంతోషంగా ఉంది. ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల రూపాయల వరకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయం. పేదల కుంటుబాలకు ఆర్థిక భద్రత కల్పించడానికి ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది. ఎల్ఐసీ ద్వారా పేదలకు పూర్తి బీమా ప్రీమియం చెల్లించడం, 5 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించడమనేది ఇప్పటివరకు ఏ సర్కారు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.
-బోయబోయిన భిక్షం, మూసీఒడ్డు సింగారం, పాలకవీడు మండలం
పేదల కష్టాలు తీర్చే మహానుభావుడు కేసీఆర్ సార్
కేసీఆర్ సార్ ఎన్నికల సందర్భంగా చాలా కొత్త పథకాలు తీసుకొచ్చిండు. అన్నీ చాలా బాగున్నాయి. ఒక కుటుంబానికి భరోసాగా కేసీఆర్ బీమా పథకం మేనిఫెస్టోలో పెట్టడం మంచి విషయం. మాలాంటి పేదలకు ఇది ఉపయోగపడుతుంది. కేసీఆర్ సార్ ఏ పథకం తీసుకొచ్చినా పేదల కోసమే. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.
-షేక్ ఖాసీం, కాశివారిగూడెం, తిప్పర్తి మండలం
కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం
కేసీఆర్ బీమా నిరుపేదలకు ధీమా. రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి రూ.5లక్షల బీమా కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం ఆనందంగా ఉంది. మా గిరిజనతండాలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. మా కుటుంబానికి భరోసాగా ఈ బీమా వరంలాంటింది. మేమంతా కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– పానుగోతు పకీరానాయక్, పానుగోతు తండా, త్రిపురారం
పేదల గురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్ సార్సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చాలా బాగుంది. కేసీఆర్ సారు మాటిచ్చిండంటే కట్టుబడి ఉంటారు. ఆయన ఆలోచనంతా పేద ప్రజల బాగు గురించే ఉంటది. కొత్తగా తీసుకొస్తున్న కేసీఆర్ బీమా పథకం ప్రతి పేద కుటుంబానికి ధీమాగా ఉంటుంది. చేతి కష్టం చేసుకునే కూలీలు, నెల జీతాలకు ఎదురుచూసే పేద, మధ్య తరగతి
ప్రజలకు ఆర్థికంగా తోడ్పాటునిస్తుంది. ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లించి 5 లక్షల బీమా కల్పించడం పేద కుటుంబాలకు భరోసా
ఇచ్చినట్లే. ప్రజలకు కావాల్సినవన్నీ అమలు చేస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు అండగా ఉంటాం.