నీలగిరి, మే 18: జిల్లాలో మంత్రులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారని, మంత్రులకు కమీషన్లు ఇచ్చేందుకే మిల్లర్లు తరుగు పేరుతో రైతుల నుంచి ధాన్యం కటింగ్ చేసి దోచుకుంటున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ధర్నాలో నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు కలెక్టరేట్ ఎదుట ధాన్యం బస్తాలు, గడ్డి మోపులతో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యంలో తాలు పేరుతో కటింగ్ చేసే విషయం జిల్లా మంత్రులకు తెలిసే జరుగుతున్నదని, మంత్రులు, మిల్లర్లు కుమ్మక్కయి రైతుల కష్టం దోచుకుంటున్నారని అన్నారు. మిల్లర్లు ఇచ్చే కమీషన్ల కోసమే మంత్రుల మౌనంగా ఉన్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకూ ఎలా దోచుకోవాలి, దాచుకోవాలి..అనే ధ్యాసే తప్ప రైతాంగాన్ని అదుకోవాలనే అలోచనే లేదన్నారు. నల్గొండను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తుంటే నాటి సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి ఫ్లోరైడ్‌ను తరిమేశారన్నారు.

ప్రజల కష్టాలు తెలుసుకున్న కేసీఆర్
ఉద్యమ సమయంలోనే కేసీఆర్ జిల్లాలోని ఊరూరూ తిరిగి ప్రజల కష్టాలు దగ్గరుండి చూశారని, అందుకే నల్లగొండపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు జిల్లాలో కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండేదని, కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి నల్లగొండ జిల్లాలో 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి, దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించిందన్నారు. ఇంతటి ఘనత సాధించిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించాల్సిన మోదీ ప్రభుత్వం తప్పుడు లెక్కలంటూ ఓసారి, ధాన్యం కొనుగోలు చేసేది లేదంటూ మరోసారి అంటే ఏకంగా ఢిల్లీలో ధర్నా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్ 24 గంటలు కరెంటు, నీళ్లు, పెట్టుబడి ఇచ్చి రైతులను కడుపులో పెట్టుకొని చూశారన్నారు.
అలాగే పండించిన పంటల కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టి చివరి గింజ వరకు కొనిపించారన్నారు.అకాల వర్షాలు వచ్చి ధాన్యం తడిస్తే వాటిని సైతం బేషరతుగా కొనుగోలు చేయించారన్నారు. దేశమంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే కల్లాల వద్దకు ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని తీసుకెళ్లి కొనుగోలు చేయించి ఎప్పటికప్పుడు రైతులకు డబ్బులు చెల్లించారన్నారు. నాటి సమైక్య రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలే ఇప్పుడు కూడా దాపురించాయని, మళ్లీ ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన చేస్తూ రైతులను ఏడిపిస్తున్నాడని అన్నారు.
జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ హెలికాప్టర్ లేనిదే కాలు కదపడం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో రోజుకు 500 కిలోమీటర్లు కారులో తిరుగుతూ రోజు మూడు రివ్యూలు చేసి ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయాన్ని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. కానీ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మిల్లర్ల వద్ద కమీషన్ల కోసమే రివ్యూలు చేస్తున్నారన్నారు. వడ్లలో తరుగు తీస్తామంటే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి, దోపిడీ ఆపాలని డిమాండ్ చేశారు. హైబ్రిడ్ కాంగ్రెస్ పాలన ప్రస్తుతం నడుస్తోందని, అసలు కాంగ్రెస్ వాళ్లు మనతో రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
జిల్లా నాశనమవుతోంది..: కంచర్ల భూపాల్‌రెడ్డి
ధాన్యం సేకరణలో కేంద్రాల నిర్వాహకులు, అధికారులు మిల్లర్లతో కుమ్మకై 42.700 కిలో గ్రాముల వరకు తూకం వేస్తూ రైతులను మోసగిస్తూ బస్తా ఒకంటికి రూ.3ల చొప్పున వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడంతో జిల్లా నాశనం అవుతోందని భూపాల్‌రెడ్డి విమర్శించారు. పది సంవత్సరాల పాటు కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ ఎలాంటి కష్టం రాకుండా కడుపులో పెట్టుకుని చూసుకున్నారన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ఐసీడీఎస్ మాజీ ఆర్వో మాలె శరణ్యారెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డి, నల్లగాని ప్రసన్నరాజ్, బీఆర్ఎస్ నేతలు బోనగిరి దేవేందర్, దేప వెంకట్‌రెడ్డి, పల్రెడ్డి రవీందర్‌రెడ్డి, ఐతగోని యాదయ్య, మాజీ ఎంపీపీలు కరీం పాషా, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, తండు సైదులు గౌడ్, కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలీ, మారగోని గణేశ్, కుందురు ప్రవీణ్ కుమార్‌రెడ్డి, దీప్లా నాయక్, పెరిక యాదయ్య తదితరులు ఉన్నారు.

రియల్ ఎస్టేట్ కోసమే సీఎం సమీక్షలు: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తాను రాజకీయాల్లో లేనని, అయితే ఆయన మూడు నెలలు ముందుగానే రివ్యూ చేసేవారని అన్నారు. కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసేవారని అందువల్లనే రైతులు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. 70 వేలమంది రైతులకు రైతు బంధు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రేవంత్ 18 గంటలు రివ్యూ చేస్తున్నట్లు చెప్పారని, ఆయన రివ్యూ కేవలం రియల్ ఎస్టేట్ కోసమేనన్నారు. కల్లాల్లో రైతులు ధాన్యం బస్తాలు మోస్తుంటే సీఎం ఢిల్లీలో డబ్బు సంచులు మోస్తున్నాడని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నాడు ధాన్యం కొనుగోలు చేయకపోతే కేసీఆర్ ఇందిరా పారు వద్ద , ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచి కొనిపించారని అన్నారు. 70 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి ఒక్కసారి కూడా రైతు సమస్యలపై చర్చించలేదన్నారు.
మోదీ హైదరాబాద్‌కు వస్తే ఆయన పకనే కూర్చుని మూసీ సుందరీ కరణ కోసం… రియల్ ఎస్టేట్ కోసం అడిగిండే తప్ప రైతుల కోసం ఏమి అడిగిండని ప్రశ్నించారు. బండి సంజయ్ కొడుకు కేసులో ఓ మహిళ కేసు పెడితే విచారించాల్సింది పోయి ఆమెపైనే రిటర్న్ కేసు పెట్టించిన చరిత్ర రేవంత్‌రెడ్డి సరార్ది అన్నారు. దీనిపై కేసీఆర్, కేటీఆర్ స్పందిస్తేనే ప్రభుత్వం యంత్రాంగం కదిలిందని, నిందితుణ్ని అరెస్టు చేసేందుకు తొమ్మిది రోజులు పట్టిందని ఇదంతా రేవంత్‌రెడ్డి ఆడిన డ్రామా అన్నారు. బీజేపీ వాళ్లు అమ్మాయిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంటే సీఎం ఏమీ పట్టనట్లు వ్యవహరించారన్నారు. ఇలాంటి దుర్మార్గులను రక్షిస్తూ… దోచుకుని, దాచుకొని పారిపోవడమే రేవంత్ లక్ష్యమని, అందుకే కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు.