‘సబ్ కమిటీ రిపోర్ట్ రాగాగే వచ్చే పంట కాలం అంటే రబీకి రైతు భరోసా ఇస్తాం. ఈ ఖరీఫ్‌కు లేనట్లే. గతంలో పెండింగ్ ఉన్న రూ.7,600 కోట్లు మేము ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఖరీఫ్‌కు ఇవ్వలేం’
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వ్యాఖ్యలివి
అధికారం కోసం ఎన్నికల హామీలో భాగంగా పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకు రూ.2లక్షల రుణమాఫీ, ఒక్కో సీజన్లో రూ.7,500 రైతు భరోసా ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజ స్వరూపం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. ఇప్పటికే రుణమాఫీకి కొర్రీల మీద కొర్రీలతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల మంది రైతులను పక్కన పెట్టింది. తాజాగా ఉమ్మడి జిల్లా రైతులకు వానకాలంలో రైతు భరోసాగా అందాల్సిన రూ.2వేల కోట్లకు ఎగనామం పెట్టేందుకు సిద్ధమైంది. సీజన్ ఆరంభంలో ఇవ్వాల్సిన రైతు భరోసాను సీజన్ ముగిసినా ఇవ్వకపోగా, చావు కబురు చల్లగ చెప్పినట్లుగా వానకాలం సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. రబీ నుంచి ఇస్తామంటూ.. అదీ రైతుభరోసాపై వేసిన సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చాకేనని కుండబద్దలు కొట్టారు. ఇన్నాళ్లు ఇగో వస్తుందేమో… అగో వస్తుందేమోనని ఎదురుచూస్తున్న రైతుల ఆశలపై నీళ్లు చల్లారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాకారి తీరుపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆదివారం ఆందోళనలకు సిద్ధమైంది. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు శనివారమే సూర్యాపేటలో రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు హైవేపై ఆందోళనకు దిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశాయి.
– నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్19 (నమస్తే తెలంగాణ)
ఒక్కో సీజన్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు రూ.2వేల కోట్ల వరకు పంట పెట్టుబడి సాయంగా అందాల్సి ఉంది. గతంలో కేసీఆర్ సర్కార్ హయాంలో 11లక్షల మంది రైతులకు ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.5వేల చొప్పున రూ.1,300కోట్ల వరకు రైతుబంధు డబ్బులు అందేవి. ప్రస్తుతం ఎకరాకు రూ.7,500 రైతు భరోసాగా అందిస్తే మరో 50 శాతం అదనంగా లబ్ధి చేకూరాల్సి ఉంది. అంటే రూ.2వేల కోట్ల రైతుభరోసా రైతులకు చెందాలి. కానీ వానకాలం రైతుభరోసాను సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు రుణమాఫీలో తీవ్ర అన్యాయం చేసింది. సుమారు రెండున్నర లక్షల మంది అర్హులైన రైతులకు రకరకాల కారణాలతో రుణమాఫీ చేయలేదు. వారంతా బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి వేసారుతున్నారు. ఇక పులిమీద పుట్రలా వానకాలం సీజన్‌కు రైతుభరోసా ఇచ్చేది లేదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నింపాదిగా చెప్పుకొచ్చారు. అలా ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులకు ఒక్కో సీజన్లో పెట్టుబడి సాయంగా అందాల్సిన సుమారు రూ.2వేల కోట్లకు ఎసరు పెట్టారు. వానకాలం సీజన్ ఆరంభం జూన్ నెల నుంచి ఉమ్మడి జిల్లాకు చెందిన 11లక్షల మందికి పైగా రైతులు రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నారు.
జూన్.. జూలై.. అంటూ సెప్టెంబర్ వరకు వేచి చూశారు. అక్టోబర్‌లోనైనా ఇస్తారేమో అనుకుంటున్న తరుణంగా మంత్రి తుమ్మల రైతుల ఆశలను ఆడియాశలు చేస్తూ బాంబు పేల్చారు. గత యాసంగి డబ్బులు మేము ఇచ్చాం కాబట్టి వానకాలం(ఖరీఫ్) డబ్బులు ఇవ్వలేమని తేల్చేశారు. యాసంగిలో ఇచ్చామంటే అవి ఏలాగూ ఇవ్వాల్సిందే అన్నది అందరికి తెలిసిందే. ఇక ఎన్నికల హామీ మేరకు రూ.7,500 ఇవ్వాల్సింది పోయి… కేసీఆర్ హయాంలోని రూ.5వేలతోనే సరిపెట్టారు. ఇప్పుడైనా 7,500 రూపాయల చొప్పున ఇస్తారనుకుంటే అసలుకే ఎసరు పెట్టేందుకు సిద్ధమయ్యారు. వానకాలం ఏమో గానీ అసలు ఈ పథకాన్ని అమలు చేస్తారా, లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో వానకాలంలో సుమారు 22లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుంటాయి. రైతులకు ఇదే కీలకమైన సీజన్. యాసంగిలో ఇంతస్థాయిలో పంటలు సాగు కావు. అందుకే వానకాలం ఎగ్గొట్టి యాసంగిలో అయితే తక్కువ విస్తీర్ణంలో పంటలు సాగువుతాయి గనుక.. సాగు చేసిన పంటలకే రైతుభరోసా ఇస్తే ప్రభుత్వంపై భారం సగానికి సగం తగ్గుతుందన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
వ్యవసాయంలో కీలకమైన సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్‌కు పెద్దపీట వేసిన కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం ఇస్తే ప్రతి ఎకరా సాగు చేస్తారనే గొప్ప ఆలోచనతో రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014కు పూర్వం 13 లక్షల ఎకరాలే సాగులో ఉండగా, ఆయన ఆలోచనను అక్షరాల నిజం చేస్తూ 2023 నాటికి 22 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. సీజన్ ఆరంభంలో రైతులకు కీలకమైన పెట్టుబడిని కేసీఆర్ సర్కారునే సమకూర్చడంతో ప్రతి ఎకరాను సాగులోకి తెచ్చి ఉమ్మడి జిల్లాలో అద్భుతమైన పంటలు పండిస్తున్నారు.
ధాన్యం దిగుబడిలో దేశంలోనే అగ్రగామి జిల్లాల సరసన నల్లగొండ నిలవడం విశేషం. 2018 వానకాలం సీజన్ నుంచి మొదలుపెట్టి ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి 10వేల రూపాయల సాయాన్ని అందిస్తూ వచ్చారు. అప్పటి నుంచి 2023 వానకాలం సీజన్ వరకు ఎన్నడూ రైతుబంధు ఆగలేదు. మొత్తం వరసగా 11 సార్లు రైతుబంధు ద్వారా ఉమ్మడి జిల్లా రైతులకు రూ.11,700 కోట్ల రూపాయల నగదును నేరుగా అందింది. ఇన్ని కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి పక్కదారి పట్టకుండా ప్రతి పైసా నేరుగా రైతులకే చెందడం విశేషం. ఇంతటి కీలకమైన పథకం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీలినీడలు కమ్ముకుంటుండడం ఆందోళన కలిగిస్తున్నది.
ఈ ఏడాది ఆరంభంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ.7,500 ఇవ్వాల్సిందిపోయి… గతంలో ఇచ్చినట్లుగానే రూ.5వేలు అష్టకష్టాల మీద ఇచ్చి చేతులు దులుపుకొంది. దాంతో రైతులు వానకాలంలో ఎకరాకు రూ.7,500 రైతుభరోసా వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ రైతులకు కాంగ్రెస్ సర్కార్ మొండిచేయి చూపినట్లే. రైతుబంధులో అనర్హులకు పెట్టుబడి సాయం అందుతున్న పేరుతో సబ్ కమిటీ వేశారు.
ఈ కమిటీ సభ్యులు హెలికాప్టర్ వేసుకుని ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వగానే గత అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించి రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల హడావుడి చూసి రైతులు నిజమే అనుకున్నారు. కానీ అభిప్రాయాల సేకరణ ఎటు పోయిందో, సబ్ కమిటీ నివేదిక ఏమైందో ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఇలా ఉండగా ఏకంగా వానకాలం రైతుభరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల ప్రకటించడంతో ఒక్కసారిగా రైతుల్లో కలవరం మొదలైంది. రుణమాఫీ పేరుతో మోసం చేసి, ఇపుడు రైతుభరోసాకు ఎగనామం పెట్టడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
వానకాలం సీజన్ రైతుభరోసా ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. రైతు భరోసా ఎగ్గొటేందుకు కుట్రలు చేస్తున్న ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమని పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం రైతులతో కలిసి అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దాంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ప్రభుత్వం దిగి వచ్చి వానకాలం రైతుభరోసా చెల్లించే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.