పీఏపల్లి, జూలై 17: నాడు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ పోతే వార్త.. నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అనే దుస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మండిపడ్డారు. పీఏపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతాంగానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేసి రైతులకు అండగా నిలిచామని, ప్రస్తుత కాంగ్రెస్ అనాలోచిత అడ్డగోలు కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వరి పొలాలు వేసేందుకు రైతులు తడులు పెడుతుంటే కరెంట్ వస్తూ… పోతుంటే పారిన మడే పారుతోందని, కొత్తగా పొలం పారట్లేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 14 గంటలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఆ 14 గంటల్లోనూ ప్రతి రెండు గంటలకోసారి కట్ చేస్తూ 10 గంటల కరెంట్ కూడా సక్రమంగా ఇవ్వట్లేదని రైతులు వాపోతున్నారని తెలిపారు.
పీఏపల్లి మండల పరిధిలోని మేడారం గ్రామ శివారులో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గత నెల 19న ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయినా ఇప్పటి కూడా అధికారికంగా ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే సబ్‌స్టేషన్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లు రాయనబోయిన శ్రీను, ఆడెపు నాగేశ్, రాజేందర్ రెడ్డి, కుండ్రెడ్డ్డి రాశేఖర్రెడ్డి, కిషన్, బీఆర్ఎస్ నాయకులు ఆర్వపల్లి నరసింహ, ఎర్ర గిరి, పరమేశ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.