కట్టంగూర్, ఏప్రిల్ 17 : కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఊట్కూరి భిక్షం శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. భిక్షం మరణానంతరం ఆయన కుటుంబీకులు విషాదం దిగమింగుకుని నేత్ర దానానికి ముందుకు వచ్చారు. నల్లగొండ ఐకాన్ లయన్స్ క్లబ్, నార్కట్పల్లి ఐ బ్యాంక్ సహకారంతో భిక్షం భౌతికకాయం నుండి నేత్రాలను సేకరించారు. ఒకవైపు కన్నీళ్లు, మరో వైపు కళ్ల దానం ద్వారా పుట్టిన ఆశ ఈ సంఘటన మానవత్వం ఇంకా సజీవంగా ఉందనే సందేశాన్ని ఇచ్చింది. భిక్షం జీవితం సేవకు ప్రతీకగా నిలిచితే ఆయన మరణం దానానికి మార్గదర్శకంగా మారింది. కుటుంబ సభ్యులను పలువురు ఓదార్చుతూ వారి నిర్ణయాన్ని అభినందించారు.