– కుటుంబానికి అండగా ఉంటాం
– మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ
దామరచర్ల, ఏప్రిల్ 13 : ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ధనావత్ అమృ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ అన్నారు. దామరచర్ల మండలం కేజేఆర్ కాలనీకి చెందిన దానవత్ అమృ సోమవారం ఉదయం వడ్ల ట్రాక్టర్‌తో మిర్యాలగూడకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో మృతి చెందాడు. విషాద విషయం తెలుసుకున్న నల్లమోతు భాస్కర్ రావు, సిద్ధార్థలు హుటాహుటిన మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని చూసి చలించిపోయి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమృ నాయక్ మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలందిస్తూ, కేజేఆర్ కాలనీలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన అంకితభావం కలిగిన కార్యకర్త అని కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి వెంట పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.